Wasim Jaffer Trolls Eng Vs NZ 1st Test: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!

3 Jun, 2022 12:22 IST|Sakshi

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య మొదలైన తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలిరోజే 17 వికెట్లు కుప్పకూలాయి. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరజట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్‌ 132 పరుగులకు చాప చుట్టేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. పిచ్‌ ఇలాగే ఉంటే మూడురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముంది. 

అయితే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ తొలి టెస్టు జరుగుతున్న లార్డ్స్‌ పిచ్‌ను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. ''లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న టెస్టులో 17 వికెట్లు ఒకేరోజు కూలాయి.. బౌలర్ల స్కిల్‌ కనిపించింది. గతంలో ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య అహ్మదాబాద్‌ టెస్టు(2021)లో మరి ఇదే స్థితి ఏర్పడింది. అప్పుడు పిచ్‌ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి ఇప్పుడేం మాట్లాడరా'' అంటూ చురకలంచటించాడు. అంతేకాదు లార్డ్స్‌ పిచ్‌ను ట్రోల్‌చేస్తూ.. సల్మాన్‌ నటించిన 'రెడీ' సినిమాలోని ''మైన్‌ కరూన్‌ తూ సాలా క్యారక్టెర్‌ దీలా హై'' అనే పాటను జతచేశాడు. ప్రస్తుతం జాఫర్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ అహ్మదాబాద్‌ వేదికగా పింక్‌బాల్‌ టెస్టు(డే నైట్‌) ఆడింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలిరోజే 112 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్‌ కూడా తొలి రోజే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 145 పరుగులకు ఆలౌట్‌ అయిన టీమిండియా 22 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. టీమిండియా ముందు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలా పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు.. ఓవరాల్‌గా 11 వికెట్లు సాధించిన స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. అశ్విన్‌ కూడా ఏడు వికెట్లు తీసి అక్షర్‌కు సహకరించాడు. అయితే ఈ టెస్టు ముగియగానే ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ వరుస విమర్శలు సంధించాడు. ''నాసిరకం పిచ్‌ తయారు చేశారని.. ఇలాంటి పిచ్‌పై రైతులు ‍వ్యవసాయం చేసుకోవచ్చు'' అంటూ వరుస ట్వీట్స్‌ చేశాడు. అయితే  అప్పట్లో టీమిండియా అభిమానులు వాన్‌కు ధీటుగానే కౌంటర్‌ ఇచ్చారు.

చదవండి: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్‌.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4!

Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్‌.. స్పిన్నర్‌ తలకు గాయం.. ఆట మధ్యలోనే..

మరిన్ని వార్తలు