'రూట్‌ భయ్యా.. ఈసారి పిచ్‌ ఎలా ఉంటుందంటావు!'

3 Mar, 2021 14:10 IST|Sakshi

అహ్మదాబాద్‌: మొటేరా వేదికగా నాలుగో టెస్టుకు ఒక్కరోజు సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో పిచ్‌పై మరోసారి చర్చ నడుస్తుంది. ఈసారి పిచ్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే వేదికలో మూడో టెస్టు జరిగినా అది డే నైట్‌ కావడం.. ఇప్పుడు జరగబోయేది డే టెస్టు కావడంతో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ట్రోల్‌ చేస్తూ ఒక ఫన్నీ ఫోటోను షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో రూట్‌ సహా స్టువర్ట్‌ బ్రాడ్‌, మార్క్‌ వుడ్‌, జానీ బెయిర్‌ స్టోలతో పాటు ఇంగ్లండ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ పాల్‌ కొలింగ్‌వుడ్‌ మొటేరా పిచ్‌ను చూస్తూ ఏదో చర్చించుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే వారు మాట్లాడుకున్నట్లుగా ఊహించుకున్న జాఫర్‌ తనదైన శైలిలో వారి సంభాషణను రాసుకొచ్చాడు. 

''బ్రాడ్‌: రూట్‌ భయ్యా.. ఈసారి పిచ్‌ ఎలా ఉందంటావు.. అలాగే ఉంటే మాత్రం టూర్‌ ముగిసినట్టే.
మార్క్‌ వుడ్‌: బ్రాడ్‌.. నవ్వు కనీసం మ్యాచ్‌లు ఆడావు.. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు..
బెయిర్‌ స్టో: నాకు ఇక్కడ ఫ్లాట్‌ పిచ్‌ మాత్రం కనబడట్లేదు.. ఈసారి కూడా డకౌట్‌గా వెనుదిరుగుతానా!
కోలింగ్‌వుడ్‌: ఈసారి కూడా పిచ్‌ స్పిన్‌కే అనుకూలించనుందా?
జో రూట్‌: చా! ఇంకోసారి ఇదే వేదికలో ఆడాల్సి వస్తుంది..  '' 

జాఫర్‌ షేర్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మూడోటెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించగానే పలువురు ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లతో పాటు యువరాజ్‌, హర్బజన్‌ లాంటి వారు విమర్శించిన సంగతి తెలిసిందే.

అయితే వీటన్నింటికి టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే  మంగళవారం తగిన సమాధానం ఇచ్చాడు.''గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్‌ పిచ్‌లపై నేరుగా లైన్‌లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్‌ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్‌మన్‌ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్‌ ఫుట్‌ లేదా బ్యాక్‌ ఫుట్‌ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్‌ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్‌ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్‌ పిచ్‌పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు. ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్‌ పిచ్‌ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్‌ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు'' అంటూ విరుచుకుపడ్డాడు.
చదవండి: బుమ్రా అందుకే సెలవు తీసుకున్నాడా?!
'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్‌ సూపర్‌'

మరిన్ని వార్తలు