Jaffer VS Vaughan Tweet War: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు మాజీల మధ్య మొదలైన వార్‌ 

22 Jun, 2022 11:26 IST|Sakshi

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్ వాన్‌, టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ల మధ్య ట్విటర్‌ వార్‌ మళ్లీ మొదలైంది. ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్‌ ప్రారంభానికి ముందు వీరిద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. తాజాగా జాఫర్‌ చేసిన ఓ ట్వీట్‌కు వాన్‌ కౌంటర్‌ ఇవ్వడంతో రగడ మొదలైంది. వాన్‌ కౌంటర్‌ ట్వీట్‌ను జాఫర్‌ తనదైన స్టైల్లో తిప్పికొట్టడంతో ట్విటర్‌ వార్‌ పతాక స్థాయికి చేరింది. జాఫర్‌-వాన్‌ల మధ్య జరుగుతున్న ఈ వార్‌ క్రికెట్‌ ఫాలోవర్స్‌కు కావాల్సిన మజాను అందిస్తుంది.

జాఫర్‌-వాన్‌ల మధ్య వార్‌ ఎక్కడ మొదలైందంటే.. 
జాఫర్‌ జూన్‌ 21న ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో కూర్చొని దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీనిపై వాన్‌ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్‌ వికెట్‌ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్‌ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన జాఫర్‌ తనదైన స్టైల్‌లో వాన్‌పై కౌంటర్‌ అటాక్‌ చేశాడు. 

2007 ఇంగ్లండ్‌ టూర్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. జాఫర్‌ వాన్‌కు ఇచ్చిన ఈ స్ట్రోక్‌ టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. నిద్రపోయిన సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

కాగా, ఇంగ్లండ్‌లో టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచింది. ఆ సిరీస్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్‌లో టీమిండియా గెలిచిన నాటింగ్హమ్‌ టెస్ట్‌లో మైఖేల్‌ వాన్‌ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్‌ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్‌లో జాఫర్‌ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఇదిలా ఉంటే, 2007లో ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ విజయం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా ఆ అవకాశం వచ్చింది. గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అప్పుడు రద్దైన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ను భారత్‌ జులై 1 నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం  డ్రా చేసుకున్నా సిరీస్‌ విజయం సాధిస్తుంది. 
చదవండి: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌‌.. కోవిడ్‌ నుంచి కోలుకున్న స్టార్‌ స్పిన్నర్‌

మరిన్ని వార్తలు