ఒక్క ఓవర్‌.. ఐదు వికెట్లు.. సూపర్ కదా‌

22 Dec, 2020 10:43 IST|Sakshi

ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీయడం అనేది కొంచెం కష్టమైన పని.. కానీ దానిని సాధ్యం చేసి చూపించాడు శ్రీలంక ఆటగాడు. ఈ మ్యాచ్‌ జరిగి ఆరు నెలలు పూర్తి కావొస్తున్నా లీగ్‌కు గుర్తింపు లేకపోవడంతో ఈ అరుదైన ఫీట్‌ వెలుగులోకి రాలేదు. తాజాగా యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ ఈ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. డ్రీమ్‌11 యూరోపియన్‌ టీ20 క్రికెట్‌ టోర్నీ పేరిట ప్రతి ఏటా లీగ్‌ను నిర్వహిస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా మే 31 నుంచి జూన్‌ 7వరకు లీగ్‌ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా వేయాలని భావించారు. కానీ లీగ్‌ను నిర్వహించాలని భావించిన డ్రీమ్‌ 11 జూన్‌ 22 నుంచి 26 వరకు టీ10 పేరిట నిర్వహించింది. రోజుకు ఐదు మ్యాచ్‌ల చొప్పున 10ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించిన ఈ లీగ్‌ను కేవలం ఐదు రోజుల్లో ముగించారు. అందులో భాగంగానే జూన్‌ 24న వింటర్థ్‌హర్‌, వోల్టెన్‌ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. (చదవండి : జడేజా కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నాడా!)

మొదట బ్యాటింగ్‌ చేసిన వోల్టెన్‌ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 8వ ఓవర్‌ వరకు ఒక వికెట్‌ నష్టానికి 75 పరుగులతో పటిష్టంగా కనిపించిన వోల్టెన్‌ ఒక్క ఓవర్‌ తేడాలోనే ఆరు వికెట్లు కోల్పోవడం విశేషం. 8వ ఓవర్‌ వేసిన శ్రీలంక బౌలర్‌ డీష్ బన్నెహేకా ఓవర్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. అనంతరం రెండో బాల్‌ డాట్‌ వేయగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇలా ఇంతకముందు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత టీ20 మ్యాచ్‌లో అల్‌ అమీన్‌ హొస్సేన్‌ పేరిట ఉంది.. అయితే ఇది టీ10 మ్యాచ్‌ కావడంతో ఈ ఫార్మాట్‌లో తొలి బౌలర్‌గా బన్నెహేకా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో బన్నెహెకా సాధించిన రికార్డు క్రికెట్‌ చరిత్రలో స్థానం సంపాదించలేకపోయింది. (చదవండి : కోహ్లిని ముంచిన పింక్‌ బాల్‌ టెస్ట్‌)

ఈ మ్యాచ్‌లో మరో ట్విస్ట్‌ ఏంటంటే బన్నెహేకా మంచి ప్రదర్శన చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వింటర్థ్‌హర్‌ 78 పరుగుల వద్దే ఆగిపోయింది. 5 రోజుల్లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్‌లో వోల్టెన్‌ సీసీపై జూరిచ్‌ నోమాడ్స్‌ జట్టు 19 పరుగుల తేడాతో గెలిచి కప్‌ను సొంతం చేసుకుంది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత టీమిండియా బౌలర్‌ దీపక్‌ చహర్‌ పేరిట ఉంది. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.2 ఓవర్లు వేసిన చహర్‌ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టీ20లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్‌గా చహర్‌ నిలవడం విశేషం.

మరిన్ని వార్తలు