హెల్మెట్‌కు తాకిన బంతి.. స్ట్రెచర్‌పై వెళ్లిన రసెల్‌

12 Jun, 2021 13:30 IST|Sakshi

అబుదాబి: విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌.. తన పవర్‌ హిట్టింగ్‌తో ఎంతోమంది బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బలంగా బాదే రసెల్‌కు షార్ట్‌బాల్‌ ఆడడంలో కాస్త వీక్‌నెస్‌ ఉంది. తాజాగా అదే షార్ట్‌బాల్‌ అతని హెల్మెట్‌కు బలంగా తాకడం.. స్ట్రెచర్‌పై మైదానం వీడేలా చేసింది. వివరాలు.. శుక్రవారం క్వెటా గ్లాడియేటర్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

అ‍ప్పటికే రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన రసెల్‌కు ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో మహ్మద్‌ ‍ముసా షార్ట్‌బాల్‌ వేశాడు. బంతి బౌన్స్‌ అయి రసెల్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో తన హెల్మెట్‌ తీసిన రసెల్‌ గాయం తీవ్రతను చూసుకున్నాడు. ఫిజియో వచ్చి పరీక్షించి ఏం కాలేదు అన్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే తరహాలో వేసిన షార్ట్‌బాల్‌ను ఆడే షాట్‌ ఆడే ప్రయత్నంలో మహ్మద్‌ వసీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో తల పట్టేయడంతో రసెల్‌ అలానే కింద కూర్చుండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్‌ తీసుకొచ్చి రసెల్‌ను దానిపై పడుకోబెట్టి తీసుకెళ్లారు. కాగా రసెల్‌ గాయం తీవ్రత గురించి ఎక్స్‌రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్‌ఎల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే రసెల్‌ గాయంపై అభిమానులు వినూత్నంగా స్పందించారు.'' రసెల్‌ ఇది ఐపీఎల్‌ కాదు.. పీఎస్‌ఎల్‌.. నువ్వు ఇంకా ఆ మాయలోనే ఉన్నట్లున్నావు..'' అంటూ కామెంట్‌ చేశారు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్‌లో వెదర్‌లాండ్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా..అజమ్‌ ఖాన్‌ 26 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 10 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొలిన్‌ మున్రో (36 బంతుల్లోనే 90 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. ఉస్మాన్‌ ఖవాజా 41 పరుగులతో అతనికి సహకరించాడు.ఈ విజయంతో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. వరుసగా నాలుగో పరాజయంతో క్వెటా ఆఖరి స్థానంలో నిలిచింది. లాహోర్‌ ఖలాండర్స్‌ 10 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. 
చదవండి: అవసరమా.. ఇలాంటి ప్లేయర్స్‌ మనకు!

'బయోబబుల్‌ నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది'

మరిన్ని వార్తలు