పొలార్డ్‌ విధ్వంసం; బంగీ జంప్‌లు చేసిన గేల్‌

2 Jul, 2021 14:49 IST|Sakshi

జమైకా: యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఏం చేసినా ఫన్నీగానే అనిపిస్తుంది. బ్యాటింగ్‌కు దిగితే భారీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడే గేల్‌ బౌలింగ్‌ సమయంలోనూ తన చర్యలతో ఆకట్టుకుంటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో గేల్‌ వికెట్‌ తీశానన్న ఆనందంలో బంగీ జంప్స్‌ చేయడం వైరల్‌గా మారింది. బ్యాటింగ్‌లో ఐదు పరుగులు మాత్రమే చేసిన గేల్‌ ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. కెప్టెన్‌ పొలార్డ్‌ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌నే గేల్‌ చేత వేయించాడు. కాగా గేల్‌ తాను వేసిన ఓవర్‌ తొలి బంతికే డేంజరస్‌ ప్లేయర్‌ రీజా హెండ్రిక్స్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. తన వ్యూహం ఫలించన్న ఆనందంలో హెండ్రిక్స్‌ పెవిలియన్‌ వెళ్లే సమయంలో గేల్‌ బంగీ జంప్స్‌ చేశాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. గేల్‌ తీరుపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.''41 ఏళ్ల వయసులో గేల్‌ ఇలాంటి పనులు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడితే.. గేల్‌కు వయసుతో సంబంధం లేదని.. అతని ఫిట్‌నెస్‌ అమోఘం'' అంటూ మరొకొందరు పేర్కొన్నారు.

కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సమం చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లోనే 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించగా.. లెండిన్‌ సిమన్స్‌ 47 పరుగులుతో రాణించాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. క్వింటన్‌ డికాక్‌ 60 పరుగులతో ఆకట్టుకోగా.. మిగతావారు ఎవరు చెప్పుకోదగ్గ స్కోరుగా చేయలేకపోయారు. కాగా నిర్ణయాత్మకమైన చివరి టీ20 శనివారం జరగనుంది.

>
మరిన్ని వార్తలు