ఓటమి కొనితెచ్చుకోవడమంటే ఇదే.. అనుభవించండి

2 Feb, 2022 15:09 IST|Sakshi

సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అది అంతర్జాతీయ మ్యాచ్‌ లేక ఇంకోటి ఏదైనా కావొచ్చు.. కచ్చితంగా గెలుస్తాం అన్న దశలో ఓటమి పాలయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేక్యంగా చెప్పనవసరం లేదు. అచ్చం అలాంటి తరహాలోనే ఒక జట్టు ఈజీగా గెలవాల్సింది పోయి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది.

విషయంలోకి వెళితే.. లోకల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఒక జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాలి. ఫోర్‌ కొడితే టై.. సిక్స్‌ కొడితే విజయం అన్నట్లుగా ఆ జట్టు పరిస్థితి ఉంది. ఇంత ఒత్తిడిలో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ ఎలాగైనా సిక్స్‌ కొట్టాలని భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ షాట్‌ మిస్‌జడ్జ్‌ అయి పుల్‌ షాట్‌ ఆడాడు. బంతి ఫీల్డర్‌ వద్దకు చేరడంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో సదరు జట్టు ఓటమి పాలయింది అని అంతా భావించారు.

చదవండి: Rohit Sharma: 'ఆరంభానికి ముందు ఈ నిరీక్షణ తట్టుకోలేకపోతున్నా'

కానీ మనం ఒకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలిచిందన్న తరహాలో బంతి పట్టిన ఫీల్డర్‌.. బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేద్దామనే ఉద్దేశంతో పరిగెత్తుకొచ్చి బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అప్పటికే బ్యాట్స్‌మన్‌ సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు. ఇక్కడితో ఊరుకున్న అయిపోయేది. కానీ మళ్లీ ఏం అనిపించిందో.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు రనౌట్‌ అవకాశం ఉందని బంతిని అటువైపు విసిరాడు. ఈసారి త్రో మిస్‌ అయిన బంతి బౌండరీ దిశగా పరుగులు పెట్టింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఒక ఫీల్డర్‌ ఆపి త్రో విసిరాడు.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ గ్యాప్‌లోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ మిగతా మూడు పరుగులు కూడా కొట్టేసి జట్టును గెలిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ నవ్వాపుకోలేకపోయారు.'' ఓటమి కొని తెచ్చుకోవడం అంటే ఇదే.. దరిద్రం నెత్తిమీద ఉంటే విజయం ఎలా వస్తుంది.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్నారు'' అంటూ కామెంట్స్‌ చేశారు. 
చదవండి: సిక్స్‌ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్‌; ఆఖరి బంతికి ట్విస్ట్‌

మరిన్ని వార్తలు