AUS VS ENG 3rd ODI: ఇదేం షాట్‌ రా బాబు.. ఇండియాలో అయితే స్టేడియం బయటపడేది..!

22 Nov, 2022 19:29 IST|Sakshi

Mitchell Marsh Massive 115 Metre Six: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (నవంబర్‌ 22) జరిగిన ఆఖరి వన్డేలో ఆతిధ్య ఆస్ట్రేలియా 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆసీస్‌.. ఈ గెలుపుతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. 

అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. 

మిచెల్‌ మార్ష్‌ 115 మీటర్ల భారీ సిక్సర్‌..
ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌లో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఓ కళ్లు చెదిరే షాట్‌ ఆడి మైదానంలోని ప్రేక్షకులదరినీ నోరెళ్ల పెట్టేలా చేశాడు. ఓల్లీ స్టోన్‌ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతిని మార్ష్‌ 115 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. మార్ష్‌ కొట్టిన ఈ షాట్‌ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి ల్యాండైంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్‌ స్టేడియం అయిన మెల్‌బోర్న్‌ మైదానంలో బంతికి స్టాండ్స్‌లోకి వెళ్లిందంటే.. ఇండియాలోని గ్రౌండ్స్‌లో బంతి మైదానం దాటుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

కాగా, క్రికెట్‌ చరిత్రలో అత్యంత భారీ సిక్సర్‌ రికార్డు పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 2013లో సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ స్టేడియంలో ఏకంగా 153 మీటర్ల అత్యంత భారీ సిక్సర్‌ బాదాడు. 
 

మరిన్ని వార్తలు