IND Vs SA: ఓవైపు భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్‌

11 Jun, 2022 16:36 IST|Sakshi

టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య గురువారం(జూన్‌ 9న) ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో తొలి టి20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మైదానంలో మ్యాచ్‌ సీరియస్‌గా సాగుతుంటే.. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఒక వర్గం మాత్రం రెండుగా చీలిపోయి కొట్టుకు చచ్చారు. గొడవకు కారణం ఏంటో తెలియదు గాని రెండు గ్రూఫులు ఒకరిపై ఒకరు పంచుల​ వర్షం కురిపించుకున్నారు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల్లో చాలా మంది ఫైటింగ్‌ను కనీసం ఆపాలనే విషయాన్ని మరిచిపోయి ఆసక్తిగా తిలకించారు.


దాదాపు ఐదు నిమిషాల పాటు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ కొట్టుకున్నారు. చివరికి ఢిల్లీ పోలీసుల ఎంట్రీతో వీరి గొడవకు బ్రేక్‌ పడింది. మ్యాచ్‌ ముగిశాక పోలీసులు గొడవకు సంబంధించిన ఇరు వర్గాలను ఆరా తీసి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్‌ కెమెరాలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అంతలా కొట్టుకున్నారంటే కచ్చితంగా ఏదైనా బలమైన కారణం ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి టి20లో బౌలింగ్‌ ఫెయిల్యూర్‌తో టీమిండియా ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 76 పరుగులు సహా శ్రేయాస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్‌ జట్టును మిల్లర్‌(64*), డుసెన్‌(75*)లు గెలిపించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడుతూ నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించిన ఈ జంట విజయంలో కీలకపాత్ర పోషించారు. డుసెన్‌ 29 పరుగుల వద్ద ఉన్నప్పుడు అయ్యర్‌ వదిలేసిన క్యాచ్‌ టీమిండియా పాలిట శాపంగా మారింది. ఇక రెండో టి20 ఆదివారం(జూన్‌ 12న)న జరగనుంది.

చదవండి: T20 Blast: చేతిలో 8 వికెట్లు.. విజయానికి 29 పరుగులు; నెత్తిన శని తాండవం చేస్తే

మరిన్ని వార్తలు