వైరల్‌: ధోని గుర్తుగా కోహ్లి హెలికాప్టర్‌ షాట్‌

3 Feb, 2021 17:11 IST|Sakshi

చెన్నై: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా తన ప్రాక్టీస్‌ను షురూ చేసింది. ఆరు రోజుల క్వారంటైన్‌ గడువు విజయవంతంగా ముగించుకున్న ఇరు జట్లు చెన్నై వేదికగా ప్రాక్టీస్‌ ఆరంభించాయి. ఈ సందర్భంగా బీసీసీఐ ట్విటర్లో టీమిండియా ప్రాక్టీస్‌ వీడియోనూ షేర్‌ చేసింది. అయితే ప్రాక్టీస్‌ సందర్భంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనిని గుర్తుకుతెస్తూ హెలికాప్టర్‌ షాట్‌ను సైగలతో అనుకరించడం వైరల్‌గా మారింది.

కోహ్లి తన జట్టు సహచరులను ఎంకరేజ్‌ చేయడంలో ముందువరుసలో ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లి ఫుట్‌బాల్‌ గేమ్‌ను ఆరంభించగా.. రిషబ్‌ పంత్‌, బుమ్రా, రోహిత్‌, హార్ధిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారా సహా ఇతర ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా మాయాంక్‌ అగర్వాల్‌ను ఆటపట్టిస్తూ కోహ్లి తన సైగలతో ఆటగాళ్లలో జోష్‌ నింపాడు. అనంతరం ధోని ఫేవరెట్‌ హెలికాప్టర్‌ షాట్‌ను గుర్తుచేస్తూ రెండు చేతులతో ఆడాడు. చదవండి: ఒక్క టెస్ట్‌.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే

కాగా ఆసీస్‌ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకున్న టీమిండియా స్వదేశంలో ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది. కాగా అడిలైడ్‌ టెస్టు అనంతరం కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో అజింక్య రహానే సారధ్యంలో టీమిండియా 2-1 తేడాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా నెల 15 రోజుల విరామం అనంతరం బరిలోకి దిగుతున్న విరాట్‌ కోహ్లి నూతనుత్సాహంతో కనిపిస్తున్నాడు.చదవండి: ఆటకు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్

చెన్నై వేదికగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగనున్న మొదటి టెస్టుకు ఇంగ్లండ్‌ కూడా సిద్ధమైంది. లంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లండ్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తుండడంతో ఆసక్తికరపోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఈ సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలిస్తే.. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆసీస్‌ దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్‌ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు