Aus Vs Afg: అతడిని తప్పించారా? టీమ్‌ బస్సు మిస్‌ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు!

4 Nov, 2022 15:25 IST|Sakshi
ఆస్ట్రేలియా జట్టు (ఫైల్‌ ఫొటో)

ICC Mens T20 World Cup 2022- Australia vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అని, ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించగల సత్తా ఉన్న బౌలర్‌ను పక్కనపెట్టడం ఏమిటని క్రీడా పండితులు ప్రశ్నిస్తున్నారు. కాగా గ్రూప్‌-1లో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.   

ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 

ఇక టిమ్‌ డేవిడ్‌ స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ జట్టులోకి రాగా.. స్టార్క్‌ స్థానంలో కేన్‌ రిచర్డ్‌సన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వేడ్‌ వెల్లడించాడు. ఫించ్‌ స్థానాన్ని కామెరూన్‌ గ్రీన్‌తో భర్తీ చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో స్టార్క్‌ లేకపోవడంపై ఆసీస్‌ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  
 
ఈ మేరకు మార్క్‌ వా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆసీస్‌ జట్టులో మిచెల్‌ స్టార్క్‌ లేడు. అతడు గాయపడ్డాడా లేదంటే తప్పించారా?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక టామ్‌ మూడీ సైతం... ‘‘మిచెల్‌ స్టార్క్‌ను తప్పించారా లేదంటే అతడు టీమ్‌ బస్‌ మిస్సయ్యాడా’’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశాడు.

ఇక మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ సైతం స్టార్క్‌ తుది జట్టులో లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘తను లేకుండా ఈరోజు మ్యాచ్‌ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కేవలం గాయపడితే తప్ప తనను పక్కనపెట్టడం సాధ్యం కాదు. అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చ గల బౌలర్‌ తను. అతడు లేకుండా ఆసీస్‌ మ్యాచ్‌ ఆడటం ఏమిటో నాకైతే ఏం అర్థం కావడం లేదు’’ అని ఈ కామెంటేటర్‌ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. స్టార్క్‌ వంటి కీలక బౌలర్‌ను తప్పించిన ఆసీస్‌ భారీ మూల్యం చెల్లించకతప్పదంటూ అతడి ఫ్యాన్స్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాపై మండిపడుతున్నారు. కాగా ప్రపంచకప్‌ టోర్నీలో స్టార్క్‌ ఇప్పటి వరకు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరంభంలో 2 వికెట్లు తీసినా 4 ఓవర్లలో ఏకంగా 43 పరుగులు సమర్పించుకుని తేలిపోయాడు.

ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో మ్యాచ్‌లో అతడికి చోటు లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో కీలక పోరులో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్‌ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్‌ దిగ్గజం.. అయితే!

మరిన్ని వార్తలు