T20 WC 2022: కివీస్‌కు ఎదురుదెబ్బ.. స్టార్‌ ప్లేయర్‌ దూరం! కెప్టెన్‌ ఏమన్నాడంటే..

21 Oct, 2022 10:57 IST|Sakshi
కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమమ్సన్‌ (PC: Twitter)

T20 World Cup 2022- Aus Vs NZ: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ధ్రువీకరించాడు. వరల్డ్‌కప్‌-2022 సూపర్‌ 12 దశ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌- గతేడాది రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనున్న విషయం తెలిసిందే.

సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా శనివారం(అక్టోబరు 22) ఇరు జట్లు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. డారిల్‌ మిచెల్‌ గాయం గురించి అప్‌డేట్‌ ఇచ్చాడు.

డారిల్‌ దూరం
ఈ మేరకు.. ‘‘డారిల్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, జట్టులో మిగతా వాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్‌కు ముందు డారిల్‌ మిచెల్‌ చేతి వేలికి గాయమైంది. దీంతో ఆ సిరీస్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు కీలక మ్యాచ్‌ కూడా ఆడలేకపోతున్నాడు. ఇక గత ప్రపంచకప్‌ ఈవెంట్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన ఈ 31 ఏళ్ల ఆల్‌రౌండర్‌.. సెమీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఆరోజు దురదృష్టవశాత్తూ
ఇదిలా ఉంటే.. గత ప్రపంచకప్‌ ఫైనల్‌ నాటి జ్ఞాపకాలను కేన్‌ విలియమ్సన్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆరోజు మ్యాచ్‌ గొప్పగా సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ మేము ఓడిపోయాం. ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇక రేపటితో అసలైన టోర్నీ మొదలుకాబోతోంది. మ్యాచ్‌ ఆరంభం నుంచే పట్టు బిగించడం ముఖ్యం. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌ ఆడటం చాలెంజింగ్‌గా ఉంటుంది’’ అని కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు.

ఇక ఆస్ట్రేలియా గడ్డపై తమ రికార్డు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మేము ఆ విషయాల గురించి పెద్దగా పట్టించుకోము. ఆస్ట్రేలియా ఎంతో పటిష్టమైన జట్టు. మాకు గట్టిపోటీనిస్తుంది. అయితే, అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు’’ అని పేర్కొన్నాడు. కాగా 2009 తర్వాత కివీస్.. ఆసీస్‌లో ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు.

చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్‌ మ్యాచ్‌ ఆడదు’

Poll
Loading...
మరిన్ని వార్తలు