Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌

25 Oct, 2022 15:19 IST|Sakshi

T20 World Cup 2022- India Vs Pakistan- Dead Ball Row: ‘‘బ్యాటర్‌ అడగ్గానే అంపైర్‌ నో బాల్‌ ఇచ్చాడు... టీమిండియా ఎప్పటిలాగే చీటింగ్‌ చేసి గెలిచింది... ముందేమో అంపైర్‌ నోబాల్‌ ఇవ్వలేదు.. విరాట్‌ కోహ్లి అడగ్గానే.. ‘‘అవును సర్‌’’ ఇది నోబాలే అన్నాడు.. నిజంగా ఇది సిగ్గుచేటు... కోహ్లి ఒత్తిడి వల్లే నో బాల్‌ ఇచ్చారు.. నిజానికి పాకిస్తాన్‌ బాగా ఆడింది.. అది అసలు నోబాల్‌ కానే కాదు.. డెడ్‌ బాల్‌గా ప్రకటించకుండా మూడు పరుగులు ఇస్తారా?’’... టీమిండియా చేతిలో పరాజయం తర్వాత పాకిస్తాన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా వెళ్లగక్కిన అక్కసు. 

ఓటమిని జీర్ణించుకోలేక నో బాల్‌ వివాదంతో భారత జట్టు గెలుపును తక్కువ చేసి చూపేందుకు అభ్యంతరకర భాషతో విరుచుకుపడ్డారు. షోయబ్‌ అక్తర్‌ వంటి మాజీ ఆటగాళ్లు సైతం.. అంపైర్‌ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుబడుతూ సెటైరికల్‌గా ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. 

స్పందించిన దిగ్గజ అంపైర్‌
ఆ మ్యాచ్‌ ముగిసి ఇరు జట్లు తదుపరి మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నా నో బాల్‌.. డెడ్‌ బాల్‌ అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ అంపైర్‌ సైమన్‌ టాఫెల్ పాక్‌ అభిమానులకు దిమ్మతిరిగేలా ఆ మూడు పరుగుల గురించి వివరణ ఇచ్చాడు.

పాక్‌ అభిమానులకు దిమ్మతిరిగే కౌంటర్‌
ఈ మేరకు భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్లో చోటుచేసుకున్న పరిణామాలపై సైమన్‌ స్పందిస్తూ.. ‘‘మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇండియా- పాకిస్తాన్‌ ఉత్కంఠ పోరులో క్లైమాక్స్‌ గురించి.. ముఖ్యంగా ఫ్రీ హిట్‌ బంతికి కోహ్లి బౌల్డ్‌ అయిన తర్వాత వచ్చిన బైస్‌ గురించి వివరించాలని చాలా మంది నన్ను అడిగారు.

ఈ విషయంలో అంపైర్‌ నిర్ణయం సరైందే! బాల్‌ స్టంప్స్‌ను తాకిన తర్వాత థర్డ్‌మ్యాన్‌ వైపు వెళ్లినపుడు బ్యాటర్లు మూడు సార్లు వికెట్ల మధ్య పరిగెత్తినపుడు బైస్‌గా ఇవ్వడం కచ్చితంగా సరైందే! ఫ్రీ హిట్‌ సమయంలో స్ట్రైకర్‌ బౌల్డ్‌ అవ్వడు.. కాబట్టి బంతి స్టంప్స్‌ను తాకినందు వల్ల డెడ్‌బాల్‌గా ప్రకటించే వీలులేదు. బైస్‌ నిబంధనల ప్రకారం అంపైర్‌ ఇచ్చిన సంకేతం సంతృప్తికరంగానే ఉంది’’ అని లింక్డిన్‌లో ఆయన రాసుకొచ్చాడు.

మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ నిబంధనల ప్రకారం.. డెడ్‌ బాల్‌గా ఎప్పుడు ప్రకటిస్తారంటే!
మ్యాచ్‌ జరుగుతున్నపుడు స్ట్రైకర్‌ బ్యాటింగ్‌ చేసేందుకు సన్నద్ధమై ఉండగా.. బౌలర్‌ బంతిని విసిరేందుకు సిద్ధమైన క్రమంలో.. ఎలాంటి కారణం చేతనైనా వికెట్‌ మీది బెయిల్‌ కింద పడినట్లయితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణస్తారు.

అదే విధంగా బంతి కీపర్‌ లేదంటే బౌలర్‌ చేతికి ఫీల్డర్‌ ద్వారా అందినట్లయితే.. అది డెడ్‌బాల్‌ అయిపోతుంది. అలాంటపుడు బ్యాటర్లు పరుగులు తీసే వీలుండదు.
నిజానికి బంతి స్టంప్స్‌ను తాకిన తర్వాత అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రీ హిట్‌ సమయంలో ఈ నిబంధన వర్తించదు. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆఖరి ఓవర్లో విరాట్‌ కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌ తీసిన మూడు పరుగులు చెల్లుబాటే అవుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.

చదవండి: T20 World Cup: అశ్విన్‌కు డీకే థాంక్స్‌! ‘‘అవును భయ్యా.. అశూ గనుక ఫినిష్‌ చేసి ఉండకపోతే!’’
T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..!
T20 World Cup 2022: పాకిస్తాన్‌ ఇంటికే.. ఆ రెండు జట్లే సెమీ ఫైనల్‌కు!

Poll
Loading...
మరిన్ని వార్తలు