T20 WC 2022: కోహ్లి, రోహిత్‌ భాయ్‌ మెచ్చుకున్నారు.. ఇంతకంటే ఏం కావాలి: పాకిస్తానీ పేసర్‌

25 Oct, 2022 18:18 IST|Sakshi
పాక్‌పై విజయం తర్వాత కోహ్లి, రోహిత్‌ ఆలింగనం

T20 World Cup 2022- India Vs Netherlands- Sydney: ‘‘నా ఎత్తు కారణంగా ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలను. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి ఆటగాళ్ల ప్రశంసలు అందుకోవడం కంటే ఓ బౌలర్‌కు ఇంకేం కావాలి? నాకు మెరుగైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ రోహిత్‌ భాయ్‌ బెస్టాఫ్‌ లక్‌ చెప్పాడు’’ అంటూ పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ జూనియర్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా తదుపరి నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సిడ్నీ చేరుకున్న రోహిత్‌ సేన గురువారం(అక్టోబరు 27) నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో ప్రాక్టీసు మొదలుపెట్టింది.


రోహిత్‌ శర్మతో మహ్మద్‌ ఇర్ఫాన్‌(PC: Twitter)

ఇందులో భాగంగా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా నెట్‌ సెషన్‌లో ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ భారత బ్యాటర్లకు బౌలింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడుతూ రోహిత్‌, కోహ్లి తనను ప్రశంసించారంటూ సంబరపడిపోయాడు ఆరడుగులకు పైగా ఎత్తుండే ఈ ఫాస్ట్‌బౌలర్‌.

ఆ కల కలగానే మిగిలి పోయింది
పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అవకాశాలు తగ్గిన తర్వాత తాను ఆస్ట్రేలియాకు మకాం మార్చానన్న ఇర్ఫాన్‌.. పాకిస్తాన్‌ ‘ఏ’ జట్టుకు ఆడిన అనుభవం తనకు ఉందన్నాడు. బాబర్‌ ఆజంతో కలిసి మ్యాచ్‌లు ఆడిన నాటి జ్ఞాపకాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. అయితే, పాక్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలన్న తన కల కలగానే మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆసీస్‌ టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌లో కాంట్రాక్ట్‌ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. 

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. నెట్‌ బౌలర్‌గా
ఆర్థికంగా తన పరిస్థితి మెరుగుపడిన తర్వాత కుటుంబం మొత్తాన్ని ఆస్ట్రేలియాకు షిఫ్ట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఇర్ఫాన్‌ తెలిపాడు. ప్రస్తుతం తాను గ్రేడ్‌ క్రికెట్‌ ఆడుతున్నానని.. తన ఖర్చులకైతే ఢోకా లేదని చెప్పుకొచ్చాడు. 

సిడ్నీలో అంతర్జాతీయ టీమ్‌లు ప్రాక్టీసు చేస్తున్నాయంటే కచ్చితంగా నెట్స్‌లో బౌలింగ్‌ చేయడానికి వస్తానంటూ ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. కాగా దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్‌కు చేరుకున్న ఇర్ఫాన్‌ ప్రస్తుతం న్యూ సౌత్‌ వేల్స్‌లోని వెస్ట్రన్‌ సబ్‌అర్బ్‌ తరఫున గ్రేడ్‌ క్రికెట్‌ ఆడుతున్నట్లు సమాచారం. శాశ్వత నివాస హోదా లభిస్తే ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడేందుకు 27 ఏళ్ల ఈ పేసర్‌కు మార్గం సుగమమవుతుంది. 

చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Poll
Loading...
మరిన్ని వార్తలు