Virat Kohli-Anushka Sharma: కేరళలో టీమిండియా.. ముంబైకి తిరిగి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే?

2 Oct, 2023 08:33 IST|Sakshi

ICC World Cup 2023- India vs Netherlands Warm Up Match: వన్డే వరల్డ్‌కప్‌-2023 వార్మప్‌ మ్యాచ్‌ నేపథ్యంలో టీమిండియా కేరళకు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్నాహక మ్యాచ్‌ ఆడేందుకు తిరువనంతరపురంలో అడుగుపెట్టింది. అయితే, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మాత్రం భారత జట్టుతో లేకపోవడం గమనార్హం.

గువాహటిలో తొలి వార్మప్‌ మ్యాచ్‌ వర్షార్పణమైన అనంతరం అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లంతా ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరారు.

పర్సనల్‌ ఎమర్జెన్సీ
కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి ముంబైకి వెళ్లినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధికారి ధ్రువీకరించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది. అయితే, సోమవారం నాటికి అతడు తిరిగి జట్టుతో చేరతాడని వెల్లడించింది.

భార్య అనుష్కను చూడటానికే..
విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మను కలిసేందుకే గువాహటి నుంచి నేరుగా ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సెలబ్రిటీ జంట త్వరలోనే తమ రెండో సంతానానికి జన్మనివ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో హఠాత్తుగా ఇలా కోహ్లి ఇంటికి వెళ్లడం చూస్తుంటే విరుష్క శుభవార్త చెప్పడం ఖాయమైందంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్‌ కోహ్లి 2017లో ఆమెను పెళ్లాడాడు.

డచ్‌ జట్టుతో మ్యాచ్‌ కూడానా?
ఈ జంటకు 2021 , జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మరోసారి అనుష్క గర్భం దాల్చిందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి వార్మప్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. ఇక తిరునవంతరపురంలోనూ ఇదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.    

చదవండి: CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..!  

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు