WC 2023: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు?

28 Oct, 2023 12:00 IST|Sakshi
బాబర్‌ ఆజం (PC: ICC)

ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్‌ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్‌ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా?

టెయిలెండర్లకు సింగిల్స్‌ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్‌ ముగించాల్సింది.

ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్‌ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లను సింగిల్స్‌కు అనుమతించేలా ఫీల్డింగ్‌ సెట్‌ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి?

నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్‌?
నలుగురైదుగురు సర్కిల్‌ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్‌ సెట్‌ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్‌ వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను కాపాడుకుందామని భావించావా? 

నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్‌? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్‌ పెట్టాలి.. సర్కిల్‌ లోపల ఎక్స్‌ట్రా ఫీల్డర్లను సెట్‌ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు.

చెత్త కెప్టెన్సీ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సారథిగా బాబర్‌ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్‌ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతులెత్తేసిన విషయం తెలిసిందే.

చెన్నైలోని చెపాక్‌ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా ఒక్క వికెట్‌ తేడాతో గట్టెక్కి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. బాబర్‌ ఆజం బృందం సెమీ ఫైనల్‌ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి.

నీ వల్లే ఓటమి!
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్‌లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్‌ ఓటమికి బాబర్‌ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. 

అతడి రాతే అంత
ఈ సందర్భంగా పాకిస్తాన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్‌ రాతే అంత. దుబాయ్‌ గ్రౌండ్‌లో హార్దిక్‌ పాండ్యా.. మెల్‌బోర్న్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్‌లో కేశవ్‌ మహరాజ్‌.. అతడి బౌలింగ్‌లో అద్భుతం చేశారు.

పాపం ప్రతిసారి నవాజ్‌ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్‌ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్‌, మహ్మద్‌ నవాజ్‌లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్‌ ఆజం నవాజ్‌ వైపు మొగ్గు చూపాడు.

ఊహించని షాకిచ్చిన కేశవ్‌ మహరాజ్‌
అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్‌ బౌలింగ్‌లో మొదటి బంతికి తబ్రేజ్‌ షంసీ సింగిల్‌ తీసి కేశవ్‌ మహరాజ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు.

అంతే.. రెండో బంతిని ఫోర్‌గా మలిచిన కేశవ్‌ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.  నవాజ్‌ మరోసారి బలిపశువు అయ్యాడు.

చదవండి: ఓవరాక్షన్‌ రిజ్వాన్‌.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్‌’ కాదు.. అర్థమైందా?

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు