WC 2022: ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్‌ మాకు కొత్తేమీ కాదు! ఇకపై

7 Nov, 2022 09:26 IST|Sakshi
చోకర్స్‌ ట్యాగ్‌ ‘నిలబెట్టుకున్న’ సౌతాఫ్రికా

ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlandsదక్షిణాఫ్రికాకు ఇది కొత్త కాదు... ఆ జట్టును అభిమానించే వారికీ ఇది కొత్త కాదు... ఐసీసీ టోర్నీల్లో ఒకదశలో అద్భుత విజయాలు సాధిస్తూ ఒక్కసారిగా ఫేవరెట్‌గా మారిపోవడం, ఆ తర్వాత కీలక సమయంలో అనూహ్య ఓటమిని ఆహ్వానించి నిష్క్రమించడాన్ని ఆ జట్టు అలవాటుగా మార్చుకుంది.

నిజం... ఈసారి వర్షం దక్షిణాఫ్రికా అదృష్టాన్ని దెబ్బ తీయలేదు. ఇదంతా స్వయంకృతమే. ఫామ్‌లో ఉన్న భారత్‌పై గెలుపొందిన తర్వాత సఫారీలకు తిరుగు లేదనిపించింది. కానీ పాకిస్తాన్‌ చేతిలో ఓటమితో పరిస్థితి కొంత మారింది. అయితే చివరి లీగ్‌ మ్యాచ్‌ బలహీనమైన నెదర్లాండ్స్‌తో కావడంతో ఇబ్బంది అనిపించలేదు. కానీ పేలవ ఆటతో జట్టు చిత్తయింది.

నెదర్లాండ్స్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన ముందు నిలవలేక సెమీస్‌ అవకాశాలను కాలదన్నుకుంది. కెప్లర్‌ వెసెల్స్‌ కాలం నుంచి క్రానే, కిర్‌స్టెన్, పొలాక్, కలిస్, డివిలియర్స్, స్టెయిన్‌లాంటి దిగ్గజాలు తలవంచినట్లుగానే మరోసారి ‘చోకర్స్‌’ పదానికి సార్థక నామధేయంగా తమ పేరును నిలబెట్టుకుంది బవుమా బృందం.

ఆ ట్యాగ్‌ భారంగా ఉంది.. అయినా
దీంతో సోషల్‌ మీడియా వేదికగా ప్రొటిస్‌ జట్టుపై కొంతమంది సానుభూతి చూపిస్తుండగా.. అంచనాలు పెంచుకున్న వాళ్లు మాత్రం.. ‘‘సౌతాఫ్రికాకు, మాకూ ఇది షరా మామూలే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చోకర్స్‌ ట్యాగ్‌పై స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఆ ట్యాగ్‌ మాకు ఎప్పటి నుంచో ఉంది. మేము మేజర్‌ టోర్నీల్లో ఫైనల్‌ చేరే దాకా కూడా అలాగే ఉంటుంది.

అయితే, టోర్నీలో మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఈ మెగా ఈవెంట్‌లో ఆడటం గొప్ప అనుభవాన్నిచ్చింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌.. మార్కోలకు తమ ఆటలోని లోపాలు గమనించి సరిదిద్దుకునే అవకాశం దొరికింది.

ఏదేమైనా ఆ ట్యాగ్‌ మోయడం మాత్రం చాలా భారంగా ఉంది. దీనిని నుంచి విముక్తి లభిస్తుందో’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక తన కెప్టెన్సీ విషయంలో యాజమాన్యంతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశాడు. భావోద్వేగాలకు తావు ఇవ్వకుండా పూర్తిగా ఆలోచించిన తర్వాతే ఈ విషయం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. 

సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాకిచ్చిందిలా..
టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 13 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరగలిగే స్థితిలో బరిలోకి దిగిన సఫారీ టీమ్‌ సమష్టి వైఫల్యంతో దెబ్బ తింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అకర్‌మన్‌ (26 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మైబర్గ్‌ (30 బంతుల్లో 37; 7 ఫోర్లు), టామ్‌ కూపర్‌ (19 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌ ఓ డౌడ్‌ (31 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. రిలీ రోసో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, బ్రెండన్‌ గ్లోవర్‌ (3/9) సఫారీలను పడగొట్టాడు. 

తొలి వికెట్‌కు 51 బంతుల్లో 58 పరుగులు జోడించి మైబర్గ్, డౌడ్‌ నెదర్లాండ్స్‌కు శుభారంభం అందించగా, ఆపై తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి డచ్‌ జోరును సఫారీ జట్టు నియంత్రించింది. అయితే చివరి 2 ఓవర్లలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు రాబట్టి నెదర్లాండ్స్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఛేదనలో మొదటి నుంచీ దక్షిణాఫ్రికా తడబడింది. ఒకదశలో 112/4తో దక్షిణాఫ్రికా నిలవగా, మిల్లర్‌ క్రీజ్‌లో ఉండటంతో గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే మిల్లర్‌ అవుట్‌తో అంతా తలకిందులైంది.  

చదవండి: T20 WC 2022: నెదర్లాండ్స్‌ సంచలనం.. బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టి మేటి జట్లతో పాటు నేరుగా
Virat Kohli: కోహ్లికి మాత్రమే ఇలాంటివి సాధ్యం..

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు