WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో!

24 Jun, 2021 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంతో కెప్టెన్సీ మార్పు అంశం మరో సారి తెరపైకి వచ్చింది. బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్  8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీపై వేటు వేసి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అలాగే టీమిండియా ఘోర ప్రదర్శనకు హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరో ప్రధాన కారణమని అభిమానులు భావిస్తున్నారు. దీంతో కోహ్లీతో పాటు కోచ్‌ రవిశాస్త్రిపై కూడా వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఓ అన్‌ లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరావడం లేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కోచ్‌ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్‌ వన్‌ స్థానం
 

>
మరిన్ని వార్తలు