IND vs WI 2nd T20 Highlights: బెంబేలెత్తించిన విండీస్‌ బౌలర్‌.. టీమిండియా ఓటమి

2 Aug, 2022 07:10 IST|Sakshi

వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వెస్టిండీస్‌ ఎట్టకేలకు బోణీ కొట్టగలిగింది. టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక చేదనలో వెస్టిండీస్‌కి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేల్ మేయర్స్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

హెట్‌మైర్‌ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔట్‌ కాగా ఓపెనర్ బ్రెండన్ కింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే 19వ ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చి విండీస్‌ బ్యాటర్లను అర్షదీప్‌ కట్టడి చేశాడు. దీంతో వెస్టిండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. ఓడియన్‌ స్మిత్‌ ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకొని సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బంతికి ఫోర్‌ బాది విండీస్‌కు విజయాన్ని అందించాడు.

అంతకముందు భారత్‌ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (0), సూర్యకుమార్‌ (11), అయ్యర్‌ (10) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్‌ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (31 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాసేపు ఆదుకున్నారు. జడేజా (30 బంతుల్లో 27; 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. అయితే మెకాయ్‌ (4–1–17–6) బెంబేలెత్తించాడు. అతను 19వ ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ (7), అశ్విన్‌ (10), భువనేశ్వర్‌ (1) వికెట్లను పడగొట్టడంతో ఆఖర్లో ఆశించినన్ని పరుగులు రాలేదు. హోల్డర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇరుజట్ల మధ్య మూడో టి20 మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది.

చదవండి: Obed Mccoy: ఒబెద్‌ మెకాయ్‌ సంచలనం.. టి20 క్రికెట్‌లో ఐదో బౌలర్‌గా

మరిన్ని వార్తలు