పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ రన్‌ ఛేజింగ్‌.. అతి భారీ లక్ష్యాన్ని ఊదేసిన విండీస్‌

2 Oct, 2023 18:18 IST|Sakshi

అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ రన్‌ ఛేజింగ్‌ నమోదైంది. ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన రన్‌ ఛేజింగ్‌ రికార్డును నెలకొల్పింది. దీనికి ముందు మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన రన్‌ ఛేజింగ్‌ రికార్డు ఇంగ్లండ్‌ పేరిట ఉండింది. 2018లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. తాజాగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ చేసిన ఛేజింగ్‌ టీ20 చరిత్రలోనే అత్యుత్తమ ఛేజింగ్‌లో ఒకటిగా మిగిలిపోనుంది. 

మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి రికార్డు సమం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, కివీస్‌ ప్లేయర్‌ సోఫీ డివైన్‌ పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును సమం చేసింది. 

లిచ్‌ఫీల్డ్‌తో పాటు ఎల్లిస్‌ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జార్జియా వేర్హమ్‌ (13 బంతుల్లో 32 నాటౌట్‌; 6 ఫోర్లు), బెత్‌ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్‌లాండ్‌ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ 3, షమీలియా కొన్నెల్‌ 2, చినెల్‌ హెన్రీ ఓ వికెట్‌ పడగొట్టారు.   

భారీ లక్ష్య ఛేదనలో బెదురులేకుండా..
213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ ఏమాత్రం బెదురులేకుండా ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. ఈ మ్యాచ్‌లో హేలీ విధ్వంసకర సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో హేలీ సెంచరీ మహిళల టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోనుంది. 

53 బంతుల్లోనే శతక్కొట్టిన హేలీ..
ఈ మ్యాచ్‌లో హేలీ 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, తన జట్టును గెలుపు ట్రాక్‌పై ఉంచింది. ఆమెకు స్టెఫానీ టేలర్‌ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) తోడవ్వడంతో విండీస్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 

నిన్న ఒక్క పరుగు తేడాతో మిస్‌ అయ్యింది..!
ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సైతం హేలీ సెంచరీకి అతి సమీపంగా వెళ్లింది. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్‌ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 74 బంతులు ఎదుర్కొన్న హేలీ 99 పరుగులతో అజేయంగా నిలిచింది. తొలి టీ20లో సెంచరీని మిస్‌ చేసుకున్న హేలీ, రెండో టీ20లో ఆ ఘనతను సాధించింది. 

వరుసగా 7 మ్యాచ్‌ల్లో..
ఆసీస్‌తో రెండో టీ20లో సెంచరీతో మెరిసిన హేలీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకుంది. గడిచిన 7 టీ20ల్లో వెస్టిండీస్‌ తరఫున హేలీనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం.   

  

మరిన్ని వార్తలు