విండీస్‌ వండర్‌... 395 పరుగుల లక్ష్యాన్ని

8 Feb, 2021 06:26 IST|Sakshi

395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కరీబియన్‌ జట్టు

అరంగేట్రంలోనే అజేయ డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన కైల్‌ మేయర్స్‌

చట్టోగ్రామ్‌: కరోనా వైరస్‌ భయంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైన వేళ... ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టు అద్భుతం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసి మూడు వికెట్ల తేడాతో విజయాన్ని హస్తగతం చేసుకొని ఔరా అనిపించింది. కైల్‌ మేయర్స్‌ (310 బంతుల్లో 210 నాటౌట్‌; 20 ఫోర్లు, 7 సిక్సర్లు) అరంగేట్రం టెస్టులోనే అద్భుతం చేశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 110/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ మరో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్‌లో ఇది ఐదో అత్యధిక ఛేదన కాగా... ఆసియాలో అతిపెద్ద ఛేదనగా నిలిచింది. 

మ్యాచ్‌ గెలవాలంటే చివరిరోజు 285 పరుగులు చేయాల్సిన దశలో మరో అరంగేట్రం ఆటగాడు ఎన్‌రుమా బోనర్‌ (245 బంతుల్లో 86; 10 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మేయర్స్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1984 తర్వాత విండీస్‌ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ క్రమంలో 178 బంతుల్లో సెంచరీని, 303 బంతుల్లో ద్విశతకాన్ని అందుకున్న మేయర్స్‌.. అరంగేట్రం మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో ‘డబుల్‌’ బాదిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు.  మేయర్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది.  రెండో టెస్టు 11 నుంచి జరుగుతుంది.

మరిన్ని వార్తలు