ఈ వెస్టిండీస్‌ క్రికెటర్‌ వారణాసి అమ్మాయిని పెళ్లాడాడు! వ్యాపారవేత్తగా ఆమె! అతడేమో..

5 Aug, 2023 11:37 IST|Sakshi

THIS West Indies Cricketer’s Wife Speaks In Bhojpuri From Varanasi: 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు వెస్టిండీస్‌ క్రికెటర్‌ డారెన్‌ గంగా. 1998-99లో సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో ఆడినవి కొద్దిమ్యాచ్‌లే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

2003లో ఆస్ట్రేలియా మీద గంగా వరుస సెంచరీలు బాదడం 90's కిడ్స్‌కు గుర్తుండే ఉంటుంది. ట్రినిడాడ్‌లోని గ్రామీణ వాతావరణంలో పెరిగిన అతడు.. బ్రియన్‌ లారా, కర్ట్‌నీ వాల్ష్‌ వంటి దిగ్గజాలతో ఆడే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు.

అలాంటిది ఏకంగా.. నాటి నెంబర్‌ టెస్టు జట్టుపై ఇలాంటి సంచలన ప్రదర్శన ఇవ్వడం ఒక్కసారిగా హీరోను చేసింది. క్రికెటర్‌ నుంచి ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన డారెన్‌ గంగా.. మన ‘ఆడపడుచు’ను వివాహమాడి భారత్‌కు అల్లుడయ్యాడన్న సంగతి తెలుసా? 


తొలిచూపులోనే..
వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ డారెన్‌ గంగా.. 2017లో న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ అకాడమీ అవార్డ్స్‌ (IIFA) ఫంక్షన్‌కి హాజరయ్యాడు. అక్కడ ప్రణిత తివారి అనే అమ్మాయి అతడికి తారసపడింది. తొలిచూపులోనే ఎందుకో ఆమె అతడికి బాగా నచ్చేసింది!

ఇంకేముంది.. ఫ్రెండ్స్‌ అంటూ చేతులు కలిపాడు. తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకొనేంత పరిచయం పెరిగింది. ఈ ప్రయాణంలో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నారు. స్నేహం పెరిగి ప్రేమగా మారింది. అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చారు.

భారత మూలాలు
డారెన్‌ గంగా ట్రినిడాడ్‌లో జన్మించినా అతడి పూర్వీకులకు భారత్‌తో సంబంధాలు ఉండటం కలిసొచ్చింది. విండీస్‌.. బ్రిటిష్‌ కాలనీగా ఉన్న సమయంలో భారత్‌ నుంచి అక్కడికి వలస వెళ్లి సెటిలైన వాళ్లలో వీళ్ల కుటుంబీకులు ఉన్నారు. అలా ట్రినిడాడ్‌లో స్థిరపడిన ఫ్యామిలీకి చెందిన నాలుగోతరం అబ్బాయే డారెన్‌ గంగా!

ఇక ప్రణిత విషయానికొస్తే.. వారణాసిలో మూలాలు కలిగి.. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ కుటుంబంలో జన్మించింది. గంగానది పరివాహకంలో సంస్కృతి సంప్రదాయాలతో విరాజిల్లే బనారస్‌కు చెందిన ఈ అమ్మాయి ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో ఉద్యోగి. 

గంగా జ్యూస్‌ బార్‌
డారెన్‌ గంగాను పెళ్లాడిన ఆమె.. 2020లో ట్రినిడాడ్‌కు మారిన తర్వాత వ్యాపారవేత్తగా అవతారమెత్తింది. తన పూర్వీకుల మూలాలు, భర్త పేరు కలిసి వచ్చేలా గంగా జ్యూస్‌ బార్‌ పేరిట లాక్‌డౌన్‌లో బిజినెస్‌ ఆరంభించింది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఇండియా- వెస్టిండీస్‌ రుచుల మేళవింపుతో ఫ్రెష్‌ జ్యూస్‌ సర్వ్‌ చేయడం గంగా బార్‌ స్పెషాలిటీ!

హిందీ, భోజ్‌పురీలో అనర్గళంగా
ఇక ఆస్ట్రేలియాలో జన్మించినప్పటికీ ప్రణిత.. బనారస్‌ మూలాలు మర్చిపోలేదు. తమ సంస్కృతీ సంప్రదాయాలను పాటించడంతో పాటు హిందీ అనర్గళంగా మాట్లాడగలదు. భోజ్‌పురిలోనూ సంభాషించగలదు. తమ ఒక్కగానొక్క కొడుకుతో ఆమె కేవలం హిందీలోనే మాట్లాడటం విశేషం.

ఇక భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారికి వీరాభిమాని అయిన ప్రణిత.. లాక్‌డౌన్‌లో అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన తమ వివాహ వేడుకలో బాలీవుడ్‌ సింగర్‌ మైకా సింగ్‌తో సంగీత్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేయించింది. ఇక డారెన్‌ గంగా ఐపీఎల్‌ కోసం ఇండియా వచ్చిన సమయంలో భర్తతో పాటు ప్రణిత కూడా ఇక్కడకు వచ్చింది.

ఆ దిగ్గజం అలా.. ఇతడేమో ఇలా
కాగా 44 ఏళ్ల డారెన్‌ గంగా.. తన కెరీర్‌లో విండీస్‌ తరఫున మొత్తంగా.. 48 టెస్టులు, 35 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ మూడు ఫార్మాట్లలో వరుసగా 2160, 843, 26 పరుగులు సాధించాడు.

ఇక డారెన్‌ గంగా సంగతి ఇలా ఉంటే.. విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌.. బాలీవుడ్‌ నటి నీనా గుప్తాతో ప్రేమాయణం నడిపి మసాబా గుప్తాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది.

చదవండి: విండీస్‌తో రెండో టీ20.. శుబ్‌మన్‌ గిల్‌పై వేటు! విధ్వంసకర ఓపెనర్‌ ఎంట్రీ
MS Dhoni: ధోని గారాలపట్టి జివా స్కూల్‌ ఫీజు తెలిస్తే షాక్‌! ఆ మాత్రం ఉండదా?

మరిన్ని వార్తలు