రఫ్ఫాడించిన రసెల్‌.. వార్నర్‌ మెరుపులు వృధా

13 Feb, 2024 17:32 IST|Sakshi

ఆస్ట్రేలియా పర్యటనను విండీస్‌ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్‌ ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని తప్పించుకున్నారు. 

రఫ్ఫాడించిన రసెల్‌.. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ రసెల్‌ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (40 బంతుల్లో 67 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్‌ ఛేజ్‌ (37), రోవ్‌మన్‌ పావెల్‌ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

వార్నర్‌ మెరుపులు వృధా
భారీ లక్ష్య ఛేదన​కు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్‌ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్‌ అయిన వెంటనే ఆసీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (19 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నిర్ణీత ఓవర్లలో ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్‌ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్‌ (12) సహా, హిట్టర్లు మిచ్‌ మార్ష్‌ (17), ఆరోన్‌ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్‌ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్‌ విజయం సాధించింది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్‌, వన్డే సిరీస్‌లు జరిగాయి. టెస్ట్‌ సిరీస్‌ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega