సూపర్‌ ఓవర్‌ అనుకున్నారు.. కానీ థ్రిల్లింగ్‌ విక్టరీ‌

17 Mar, 2021 13:05 IST|Sakshi

రాయ్‌పూర్‌: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ లెజెండ్స్‌, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. విండీస్‌ విజయానికి ఒక్క పరుగు దూరంలో బ్రియాన్‌ లారా వికెట్‌ కోల్పోవడం.. ఆ తర్వాత టినో బెస్ట్‌ సూపర్‌ ఓవర్‌కు అవకాశం ఇవ్వకుండా సింగిల్‌ తీయడంతో విండీస్‌ లెజెండ్స్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్‌ మస్టర్డ్‌ 57, కెవిన్‌ పీటర్సన్‌ 37 పరుగులతో శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఒవైసీ షా (30 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ లెజెండ్స్‌కు ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ శుభారంభం అందించాడు. 31 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నర్సింగ్ డియోనారైన్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు.


అయితే 34 పరుగులు చేసిన కిర్క్‌ ఎడ్‌వర్డ్స్‌ 19వ ఓవర్లో వెనుదిరగడంతో ఆఖర్లో హై డ్రామా నెలకొంది. ఆ తర్వాత వచ్చిన లారా కూడా 20వ ఓవర్‌ ఐదో బంతికి 3 పరుగులు చేసి స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో సూపర్‌ ఓవర్‌ ఖాయం అనుకున్న దశలో ఇన్నింగ్స్‌ చివరి బంతికి బెస్ట్‌ సింగిల్‌ తీసి వెస్టిండీస్‌  లెజెండ్స్‌ను సెమీస్‌కు చేర్చాడు. కాగా నేడు సెమీస్‌లో ఇండియా లెజెండ్స్‌ను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌ శ్రీలంక లెజెండ్స్‌, దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ మధ్య జరగనుంది. ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం(మార్చి 21న) జరగనుంది.
చదవండి:
పంత్‌ తొందరపడ్డావు.. రెండు రన్స్‌తో ఆగిపోవాల్సింది

దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్‌

మరిన్ని వార్తలు