విండీస్‌ చేతులెత్తేసింది

29 Jul, 2020 03:21 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకు ఆలౌట్‌

చివరి టెస్టులో 269 పరుగులతో ఇంగ్లండ్‌ ఘన విజయం

2–1తో ‘విజ్డన్‌ ట్రోఫీ’ని     సొంతం చేసుకున్న రూట్‌ సేన

వెస్టిండీస్‌ ఆట మారలేదు. రాత కూడా మారలేదు. ఒక రోజంతా వరుణుడు అడ్డుగా నిలబడి ఓటమి నుంచి తప్పించుకునే అవకాశం ఇచ్చినా దానిని హోల్డర్‌ బృందం వృథా చేసుకుంది. పేలవ బ్యాటింగ్‌తో కేవలం 31.1 ఓవర్లకే 8 వికెట్లు ఇచ్చేసి ఘోర పరాజయం చవిచూసింది. పదునైన బౌలింగ్‌తో చెలరేగిన ఇంగ్లండ్‌ సునాయాసంగా తమ పని పూర్తి చేసి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. చివరి ‘విజ్డన్‌ ట్రోఫీ’ని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకుంది.

మాంచెస్టర్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ ఖాతాలో మరో టెస్టు సిరీస్‌ చేరింది. వెస్టిండీస్‌ చేతిలో మొదటి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకున్న ఇంగ్లండ్‌ సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. మంగళవారం ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలో ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్‌ 269 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. 399 పరుగుల ఛేదనలో 2 వికెట్లకు 10 పరుగుల స్కోరుతో ఆట చివరి రోజు తమ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ 37.1 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. షై హోప్‌ (38 బంతుల్లో 31; 6 ఫోర్లు)దే అత్యధిక స్కోరు.

ఆటపరంగా నిరాశపర్చినా.... కరోనా కష్టకాలంలో క్రికెట్‌ ఆడేందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానం చూరగొన్న విండీస్‌ చివరకు ఆ సంతృప్తితోనే వెనుదిరిగింది. విజయంపై ఎలాంటి ఆశలు లేకపోయినా చివరి రోజు పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి వికెట్లు కాపాడుకునే అవకాశం విండీస్‌ ముందు నిలిచింది. స్వల్పంగా కురిసిన వర్షం మరోసారి జట్టుకు సహకరించేలా కనిపించింది. అయితే జట్టు బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా పట్టుదల కనబర్చలేదు. క్రిస్‌ వోక్స్‌ (5/50), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/36) చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 6 వికెట్లతో కలిపి మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన బ్రాడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఐదో రోజు ఆరంభంలోనే బ్రాత్‌వైట్‌ (19)ను బ్రాడ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న తర్వాత మొదలైన విండీస్‌ పతనం వేగంగా సాగిపోయింది.

ఇది బ్రాడ్‌కు 500వ వికెట్‌ కావడం విశేషం. ఆ తర్వాత వోక్స్‌ వరుస ఓవర్లలో హోప్, బ్రూక్స్‌ (22)లను వెనక్కి పంపడంతో జట్టు సగం వికెట్లు కోల్పోయింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి ఛేజ్‌ (7) రనౌట్‌ కాగా... కెప్టెన్‌ హోల్డర్‌ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. వోక్స్‌ మరోసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టగా... బ్లాక్‌వుడ్‌ (23)ను చివరి వికెట్‌గా అవుట్‌ చేసి బ్రాడ్‌ విండీస్‌ ఆట ముగించాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో విండీస్‌ గెలవగా... మాంచెస్టర్‌లో జరిగిన మిగిలిన రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ నెగ్గింది. ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్‌ తరఫున స్టోక్స్‌ కాకుండా బ్రాడ్‌  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికవగా (ప్రత్యర్థి జట్ల కోచ్‌ ఈ విజేతను ఎంపిక చేస్తారు), విండీస్‌ తరఫున రోస్టన్‌ ఛేజ్‌కు ఈ పురస్కారం దక్కింది.
విజ్డన్‌ సిరీస్‌ ట్రోఫీతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌

>
మరిన్ని వార్తలు