231 పరుగులు కావాలి.. 213 పరుగులే చేసింది!

14 Feb, 2021 19:14 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయిన వెస్టిండీస్‌.. అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టెస్టులో మూడు వికెట్ల తేడాతో గెలిచిన విండీస్‌.. రెండో టెస్టులో 17 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. కనీసం రెండో టెస్టులో గెలుస్తుందనుకున్న బంగ్లాదేశ్‌ చివరి వరకూ పోరాడి ఓటమి పాలైంది. విజయానికి స్వల్ప దూరంలో ఆగిపోయి సిరీస్‌ను సమర్పరించుకుంది. విండీస్‌ నిర్దేశించిన 231 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 213 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా పరాజయం తప్పలేదు.   

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో  తమీమ్‌ ఇక్బాల్‌(50) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఇక్బాల్‌ తర్వాత మెహిదీ హసన్‌(31)ఒక్కడే ఆ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడు. కాగా, మెహిదీ హసన్‌ చివరి వికెట్‌గా ఔట్‌ కావడంతో బంగ్లాదేశ్‌ను పరాజయం వెక్కిరించింది. వారికన్‌ బౌలింగ్‌లో కార్న్‌వాల్‌ అద్భుతమైన  క్యాచ్‌ పట్టడంతో హసన్‌ నిష్క్రమణతో పాటు బంగ్లా ఇన్నింగ్స్‌ ముగిసింది.  స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను భారీ కాయుడైన కార్న్‌వాల్‌ కుడివైపుకు డైవ్‌ కొట్టి మరీ అందుకోవడంతో హసన్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ క్యాచ్‌తో బంగ్లాదేశ్‌ పరాజయం ఖరారు కావడంతో విండీస్‌ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించిన కార్న్‌వాల్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కార్న్‌వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇంకా రోజు మిగిలి ఉండగానే మ్యాచ్‌లో ఫలితం వచ్చింది.

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 409 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 117 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 296 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 213 ఆలౌట్‌

ఇక్కడ చదవండి: ఒక్క పరుగుతో 66 ఏళ్ల ‘నో ఎక్స్‌ట్రా’ రికార్డు బ్రేక్‌

200 మంది లెఫ్ట్‌ హ్యాండర్స్‌.. తొలి బౌలర్‌గా రికార్డు

మరిన్ని వార్తలు