‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’కు మహిళా క్రికెటర్ల మద్దతు

21 Sep, 2020 08:48 IST|Sakshi

నేడు ఇంగ్లండ్, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి టి20

మ్యాచ్‌కు ముందు సంఘీభావం ప్రకటించనున్న ప్లేయర్లు

లండన్‌: నల్లజాతీయులు చేస్తోన్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి వెస్టిండీస్, ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్లు మద్దతు ఇవ్వనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా డెర్బీ వేదికగా నేడు తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇరు జట్ల ఆటగాళ్లు జెర్సీలపై ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ లోగో ధరించడంతో పాటు మ్యాచ్‌కు ముందు మోకాలిపై కూర్చొని సంఘీభావం తెలపనున్నారు. ‘ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలో చెబితే అది ఆచరించడానికి మేం సిద్ధంగా ఉన్నామంటూ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీథెర్‌ నైట్‌ నాకు సందేశం పంపింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా జెర్సీలపై లోగో ధరించడంతో పాటు ప్రతీ మ్యాచ్‌కు ముందు మేమంతా సంఘీభావం తెలుపుతాం’ అని విండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ పేర్కొంది. మార్చిలో టి20 ప్రపంచ కప్‌ తర్వాత మహిళల క్రికెట్‌లో జరుగనున్న తొలి అంతర్జాతీయ సిరీస్‌ ఇదే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు