ఇలా అయితే కష్టం: మోర్గాన్‌

17 Oct, 2020 16:39 IST|Sakshi

అబుదాబి: ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ప్రశంసలు కురిపించాడు. తమతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిందన్నాడు. ముంబైతో మ్యాచ్‌లో తాము ఏ దశలోనూ రేసులో లేమనే విషయం ఒప్పుకోవాలన్నాడు. ముంబై అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. ముంబై ఇలా ఆడితే వారిని ఆపడం చాలా కష్టమన్నాడు.మ్యాచ్‌ తర్వాత మోర్గాన్‌ మాట్లాడుతూ..‘ ముంబైతో మ్యాచ్‌లో మేము ఎక్కడా కూడా పైచేయి సాధించలేదు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి కడవరకూ ముంబైకు ధీటుగా పోటీ ఇవ్వలేకపోయాం. ముంబై ఆటగాళ్లు ఇలా చెలరేగి ఆడితే వారిని ఆపడం చాలా కష్టం. 10 ఓవర్లు ముగిసే సరికి నాలుగు నుంచి ఐదు వికెట్లు కోల్పోతే పోటీలో నిలవడం కష్టం. (డీకాక్‌ డగౌట్‌ వైపు పరుగు.. రోహిత్‌ నవ్వులు!)

పోటీలో ఉండాలంటే ఎక్కడో చోట మంచి భాగస్వామ్యం రావాలి. అసలు బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయాలంటే బోర్డుపై మంచి స్కోరు ఉండాలి కదా. మా ఆరంభం బాగాలేకపోవడమే ఓటమికి కారణం.ఈ తరహా ఆరంభాన్ని ఎవరూ కోరుకోరు’ అని మోర్గాన్‌ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌(53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ ఈ మాత్రం స్కోరును బోర్డుపై ఉంచకల్గింది.  అయితే ముంబై ఇండియన్స్‌కు సరిపోలేదు. ముంబై ఇండియన్స్‌ ఆడుతు పాడుతూ 16.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. డీకాక్‌(78 నాటౌట్‌; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించి ముంబైకు ఘనవిజయాన్ని అందించాడు.

మరిన్ని వార్తలు