వద్దు సార్‌.. జట్టును నాశనం చేస్తాడు!

2 Aug, 2020 20:31 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మూడు టైటిళ్లను గెలిచిన కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.  చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున(సీఎస్‌కే) మూడు టైటిళ్లు గెలుచుకుని, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే ఇప్పటివరకూ 10 సీజన్లు ఆడగా అన్నింటికీ ధోని కెప్టెన్‌గా వ్యహరించాడు. తాజాగా ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌. సీఎస్‌కే యజమాని, ఇండియా సిమెంట్స్ అధినేత అయిన శ్రీనివాసన్ గ్రేట్‌ లేక్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడుతూ.. ధోని గురించి కొన్ని విషయాలను షేర్‌ చేసుకున్నారు. ప్రధానంగా ఐపీఎల్‌లో ఒక ఆటగాడ్ని తాను సూచిస్తే అందుకు వద్దన్నాడని శ్రీనివాససన్‌ తెలిపారు.

‘గతంలో ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక ఆటగాడ్ని నేను సూచించా. అతను విపరీతమైన టాలెంట్‌ ఉన్న ఆటగాడు. కానీ అతన్ని వద్దన్నాడు ధోని. వద్దు సార్‌.. జట్టును అతను నాశనం చేస్తాడు. ఏ ఆటగాడినైనా అంచనా వేయడంలో ధోని దిట్ట. ఒక ఆటగాడి పట్ల ఒకటి ఫిక్స్‌ అయితే దానికి ధోని కట్టుబడి ఉంటాడు. అభిప్రాయాన్నైనా, అపోహనైనా ధోని తేల్చిచెబుతాడు. అతని జడ్జ్‌మెంట్‌ అలానే ఉంటుంది’  అని చెప్పినట్లు శ్రీనివాసన్‌ తెలిపారు. అయితే ఆ ఆటగాడు ఎవరు అనేది శ్రీనివాసన్‌ తెలపలేదు. కాగా, గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని రిటైర్మెంట్‌పై రూమర్లు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. అయితే గత కొన్ని నెలలుగా కరోనా విజృంభణతో స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ఏమీ లేకపోవడంతో ధోని ప్రస్తావన రావడం లేదు. అయితే మళ్లీ ఐపీఎల్‌కు దాదాపు మార్గం సుగుమం అయిన క్రమంలో ధోని ప్రస్తావన షురూ అయ్యింది. సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా ఐపీఎల్‌ నిర్వహించడానికి ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసిన క్రమంలో సీఎస్‌కే ముందుగా ప్రాక్టీస్‌ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ముందుగానే అక్కడకు చేరుకుని ప్రాక్టీస్‌ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ధోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టులో రీఎంట్రీ ఇవ్వడానికి కూడా ఐపీఎల్‌ ధోనికి కీలకం కానుంది. 

మరిన్ని వార్తలు