IPL 2022: తను బాగా ఆడితే నా కన్న కొడుకే ఆడినంతగా సంబర పడతా: ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌

6 Apr, 2022 13:11 IST|Sakshi
ఎమ్మెస్కే ప్రసాద్‌(ఫైల్‌ ఫొటో)

MSK Prasad Comments: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై భారత జట్టు మాజీ సెలక్టర్‌ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌-2022లో కొత్త జట్టు గుజరాత్‌ కెప్టెన్‌గా అదరగొడుతున్నాడని, ఆ అనుభవం హార్దిక్‌ కెరీర్‌కు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. మైదానంలో అతడు వ్యవహరిస్తున్న తీరు ముచ్చటగొలుపుతోందన్నాడు. భావోద్వేగాలకు అతీతంగా హుందాగా ప్రవర్తిస్తూ మానసికంగా పరిణతి చెందుతున్నాడని కొనియాడాడు.

కాగా హార్దిక్‌ పాండ్యా 2016లో భారత జట్టుకు ఎంపిక కావడంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ పాత్ర మరువలేనిది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న హార్దిక్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అయితే, గతేడాది నుంచి ఫామ్‌లేమితో సతమతమవడం, బౌలింగ్‌ చేయలేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ క్రికెట్‌ అకాడమీలో హార్దిక్‌ శిక్షణ పొందాడు.

బీసీసీఐ నుంచి పిలుపు రాకపోవడం సహా ఐపీఎల్‌లో తనను ప్రోత్సహించిన ముంబై ఇండియన్స్‌ కూడా రిటైన్‌ చేసుకోకపోవడంతో హార్దిక్‌ కెరీర్‌ మసకబారుతోందంటూ కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ అతడిని కొనుగోలు చేసి తమ జట్టు సారథిగా నియమించింది. ఇక సారథిగా హార్దిక్‌కు ఇదే తొలి అనుభవం.

అయినప్పటికీ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో తనదైన ముద్ర వేసి హార్దిక్‌ జట్టుకు వరుస విజయాలు అందించాడు. లక్నో, ఢిల్లీ జట్లపై గెలుపుతో సారథిగా శుభారంభం అందుకున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో 31 పరుగులు, లక్నోపై 33 పరుగులు సాధించి బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో బొరియా మజుందార్‌ యూట్యూబ్‌ చానెల్‌లో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్‌ మాట్లాడుతూ హార్దిక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘తను బాగా ఆడితే... నాకు అది గర్వకారణం. నా కన్న కొడుకుదే ఆ విజయం అన్నంతగా సంబరపడతా. దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ వారసత్వాన్ని కొనసాగించగల ఆల్‌రౌండ్‌ ప్రతిభను వెలికితీయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.  అయితే, ఈ యంగ్‌స్టర్‌లో నేను ఆ లక్షణాలు చూశాను. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో అతడు స్ట్రాంగ్‌.

ఇప్పుడు తను వ్యక్తిగతంగా, ఆటగాడిగా మరింత పరిణతి చెందాడు. తనకు పెళ్లైంది. జీవితంలో సెటిలయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ అయ్యాడు. ఈ అనుభవం తనను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. భారత జట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఫీల్డ్‌లో హార్దిక్‌ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అని హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఏప్రిల్‌ 8న పంజాబ్‌ కింగ్స్‌తో గుజరాత్‌ తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో భావోద్వేగానికి గురైన హార్దిక్‌.. జట్టును అత్యున్నత శిఖరాలకు చేరుస్తానంటూ అభిమానులకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022: కోహ్లి రనౌట్‌.. చహల్‌ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్‌.. మరీ ఇంత సంతోషమా? వైరల్‌

మరిన్ని వార్తలు