Wasim Jaffer: జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే, మొదట వచ్చేది సంజూ పేరే..!

29 Nov, 2022 16:20 IST|Sakshi

భారత తుది జట్టు కూర్పులో ఇటీవలి కాలంలో యువ ఆటగాడు సంజూ శాం‍సన్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుం‍దని దేశ విదేశాల్లో ఉన్న క్రికెట్‌ అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు. అసామనమైన ప్రతిభ, టెక్నిక్‌, ధాటిగా ఆడగల సామర్థ్యం పెట్టుకుని కూడా శాంసన్‌.. టీమిండియా ఆడిన చాలా మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అతని ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 27 మ్యాచ్‌లు (11 వన్డేలు, 16 టీ20లు) మాత్రమే అడాడంటే, బీసీసీఐ అతనిపై ఏ రేంజ్‌లో చిన్న చూపు చూస్తుందోనన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

అడపాదడపా అవకాశాలు వస్తే, అందులో రాణించినా ఆ మరుసటి మ్యాచ్‌లోనే రకరకాల కారణాలు చెప్పి సంజూని తుది జట్టు నుంచి తప్పించడం మేనేజ్‌మెంట్‌కు పరిపాటిగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ఇందుకు తాజా ఉదాహరణ. సంజూకు అన్యాయం జరుగుతుందన్న విషయం.. బీసీసీఐ సహా యావత్‌ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంపై ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు.

ఈ విషయంపై జర్నలిస్ట్‌లు భారత టీ20 జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను ప్రశ్నిస్తే.. నా జట్టు నా ఇష్టమన్నది అతని నుంచి వచ్చిన సమాధానం. ఇదే విషయంపై వన్డే సారధి ధవన్‌ను ప్రశ్నించగా.. జట్టు సమతూకం, ఆరో బౌలర్‌ అవసరం అని పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆరో బౌలర్‌ అవసరం అయితే, పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్‌  పంత్‌ను తప్పించాలి కాని, శాంసన్‌ను తప్పించడమేంటని అని అభిమానులు అడిగితే స్పందించేవాడే కరువయ్యాడు.

తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ కూడా ప్రస్తావించాడు. భారత తుది జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే.. మొదటగా వచ్చే పేరు శాంసన్‌దేనని అన్నాడు. ఇది చాలా బాధాకరం. తనను జట్టు నుంచి ఎందుకు తప్పిస్తున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో శాంసన్‌ ఉన్నాడంటూ సానుభూతిని వ్యక్తం చేశాడు.

శాంసన్‌ అద్భుతమైన ప్లేయర్‌ అని మేనేజ్‌మెంట్‌ కూడా తెలుసు, అయినా సరైన అవకాశాలు ఇవ్వకుండా అతని కెరీర్‌ను నాశనం చేస్తుందంటూ జాఫర్‌ ధ్వజమెత్తాడు. శాంసన్‌పై ఇంత చిన్నచూపు చూసే యాజమాన్యం పంత్‌ను మాత్రం ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్ధం కావట్లేదని అన్నాడు. రేపు (నవంబర్‌ 30) జరుగబోయే మూడో వన్డేలోనైనా మేనేజ్‌మెంట్‌ శాంసన్‌కు అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూడాలని తెలిపాడు.  

మరిన్ని వార్తలు