WC 2023: ఈసారి వరల్డ్‌కప్‌ ఫేవరెట్లు ఆ ఐదు జట్లే! కానీ..

23 Sep, 2023 17:32 IST|Sakshi
ఐసీసీ వరల్డ్‌కప్‌-2023 (PC: ICC)

ICC World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023కి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య అక్టోబరు 5న ఈ ఐసీసీ ఈవెంట్‌ 13వ ఎడిషన్‌ మొదలుకానుంది.

పుష్కర కాలం తర్వాత భారత్‌ ఆతిథ్య ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ తదితర పది జట్లు పాల్గొనబోతున్నాయి.

2011లో.. తర్వాత మళ్లీ ఇప్పుడే
ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన హాట్‌ ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆసియా వన్డే కప్‌-2023 గెలిచి జోరు మీదున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. 

మరోవైపు.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ బెన్‌ స్టోక్స్‌ రాకతో మరింత పటిష్టంగా మారగా.. ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(బార్డ్‌) వరల్డ్‌కప్‌-2023లో ఫేవరెట్లు ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

ఈ ఐదు జట్లు ఫేవరెట్‌.. కానీ
‘‘వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే ఇండియా టాప్‌ ర్యాంకులో ఉంది. అదీగాకుండా ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగనుంది. కాబట్టి వాళ్లకు హోం అడ్వాంటేజ్‌ కూడా ఉంటుంది. ఇక ఇంగ్లండ్‌.. డిఫెండింగ్‌ చాంపియన్‌ కూడా పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉంది. కాబట్టి ఆసీస్‌ జట్టు కూడా ఎప్పుడూ బలమైన పోటీదారే. పాకిస్తాన్‌ కూడా తనదైన రోజున అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. పాక్‌ జట్టులో చాలా మంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా కూడా గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతోంది.

సమతూకమైన జట్టుగానూ ఉంది. న్యూజిలాండ్‌, శ్రీలంక కూడా సవాల్‌ విసరగలుగుతాయి. అయితే, ఐసీసీ వరల్డ్‌కప్‌ విజేత ఎవరన్న అంశంపై అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత ఫామ్‌, ర్యాంకింగ్‌ దృష్ట్యానే ఈ టీమ్‌లను ఎంచుకోవడం జరిగింది’’ అని బార్డ్‌ సమాధానమిచ్చింది.

చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త!

మరిన్ని వార్తలు