Rinku Singh: తొమ్మిదో క్లాస్‌లో చదువు బంద్‌.. స్వీపర్‌, ఆటోడ్రైవర్‌.. ఆ 80 లక్షలు!

3 May, 2022 13:24 IST|Sakshi
కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌( Courtesy: IPL Twitter)

IPL 2022 KKR- Who Is Rinku Singh: ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్రైడర్స్‌ యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 23 బంతుల్లో 42 పరుగులు సాధించి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే, గత కొన్ని సీజన్‌లుగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన రింకూ.. చాలా మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు.

2018లో ఐపీఎల్‌ల్లో అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు కేవలం 13 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌కు తన మెరుపు ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ స్థాయికి చేరుకునే క్రమంలో రింకూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. పొట్ట కూటి కోసం అతడు  స్వీపర్‌గా, ఆటో డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. 

ఎవరీ రింకూ సింగ్‌?
24 ఏళ్ల రింకూ సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో అతి సామాన్యమైన కుటంబంలో జన్మించాడు. రింకూ తండ్రి అలీఘర్‌లో డోర్ టు డోర్ గ్యాస్ సిలిండర్లను డెలివరి చేస్తూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. రింకూ సోదరుడు ఆటో నడుపుతుంటాడు. ఇక రింకూ తన జీవితంలో ఒకానొక సమయంలో స్వీపర్‌గా కూడా పని చేశాడు. అదే విధంగా అతడి సోదరుడికి ఆటో నడపడంలో కూడా రింకూ సహాయపడేవాడు.

ఇక రింకూ పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువును మానేశాడు. అదే విధంగా అలీఘర్‌లోని రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్‌లో తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇక 2018 ఐపీఎల్‌ వేలంలో రింకూ సింగ్‌ను రూ. 80 లక్షలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ కాంట్రాక్ట్ రింకూ జీవితాన్ని మార్చేసింది.

ఇక గతంలో 2018 ఐపీఎల్‌ మెగా వేలం తర్వాత మాట్లాడిన రింకూ.. "వేలంలో నాకు 20 లక్షలు వస్తాయని అనుకున్నాను. కానీ నన్ను 80 లక్షలకు కొనుగోలు చేశారు. నా తమ్ముడు, నా చెల్లెలి పెళ్లికి ఆ డబ్బులు ఖర్చుపెడతాను" అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

రింకూ సింగ్‌ డొమెస్టిక్‌ కెరీర్‌
రింకూ దేశీవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రింకూ  2307 పరుగులు చేశాడు. అదే విధంగా అతడు 41 లిస్ట్-ఎ మ్యాచ్‌లు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఎ కెరీర్‌లో 1414 పరుగులు, టీ20ల్లో 1414 పరుగులు సాధించాడు. ఇక  ఐపీఎల్ కెరీర్‌ విషయానికి వస్తే రింకూ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 117 పరుగులు చేశాడు.

చదవండి: Rinku Singh: నాకు ఆ అమ్మాయంటే ఇష్టం.. కానీ పెళ్లి చేసుకోను అన్నట్లు.. ఏంటిది? పాపం రింకూ..

మరిన్ని వార్తలు