IND Vs BAN: ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వదిలి భారత జట్టుకు.. ఎవరీ సౌరభ్‌ కుమార్‌?

12 Dec, 2022 16:20 IST|Sakshi

మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌ కుమార్‌ భారత తరపున అరంగేట్రం చేసేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో సౌరభ్‌ కుమార్‌కు చోటు దక్కింది. అయితే అతడికి తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు . ఇక తాజాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో సౌరభ్‌ కుమార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

ఈ క్రమంలో భారత తరపున సత్తా చాటేందుకు సౌరభ్‌ కుమార్‌ ఊ‍వ్విళ్లరూతున్నాడు. కాగా సౌరభ్‌ కుమార్‌ దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌-'ఎ'తో అనధికార టెస్టు సిరీస్‌లో కూడా సౌరభ్‌ తన ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సౌరబ్‌ను బంగ్లాతో సిరీస్‌కు సెలక్టర్లు ఎంపికచేశారు. 

ఎవరీ సౌరభ్‌ కుమార్‌?
29 ఏళ్ల సౌరభ్‌ కుమార్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని భగ్‌పాట్‌లో జన్మించాడు. కాగా తన రాష్ట్ర సీనియర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించేముందు అతడు అండర్‌-19, అండర్‌-22 డివిజన్స్‌లో ఆడాడు. అనంతరం క్రికెట్‌పై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగంలో చేరాడు. అయినప్పటికీ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలన్న తన పట్టుదలను మాత్రం వదలలేదు.

ఈ క్రమంలో 2014లో సర్వీసెస్‌ తరపున హిమాచల్‌ ప్రదేశ్‌పై  సౌరభ్‌ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అనంతరం 2015లో ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగం  నుంచి వైదొలిగిన సౌరభ్‌ తన సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన రంజీ అరంగేట్ర సీజన్‌లోనే 17 వికెట్లతో పాటు 304 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌-2013 సీజన్‌లో సౌరభ్‌ను పుణే వారియర్స్‌ కొనుగోలు చేసింది. అయినప్పటికీ అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు.
చదవండిENG Vs PAK: పాకిస్తాన్‌ గడ్డపై ఇంగ్లండ్‌ సరికొత్త చరిత్ర.. 22 ఏళ్ల తర్వాత తొలి సారిగా

మరిన్ని వార్తలు