ఐపీఎల్‌ 2020: తొలి ఫైనల్‌ బెర్తు ఎవరిదో?

5 Nov, 2020 19:08 IST|Sakshi

దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌ ప్లేఆ‍ఫ్స్‌ సమరంలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై జట్టే విజయం సాధించింది.  తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 162 పరుగులు చేయగా... ముంబై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గత శనివారం జరిగిన తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ పేలవంగా ఆడి 110 పరుగులు చేయగా, ముంబై 14.2 ఓవర్లలోనే గెలిచింది. ఓవరాల్‌గా ఇప్పటివరకూ ఇరుజట్లు తమ ముఖాముఖి పోరులో 26సార్లు తలపడగా 14సార్లు ముంబై గెలవగా, 12సార్లు ఢిల్లీనే విజయం వరించింది. ఢిల్లీతో తలపడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు ముంబై విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌  అనుకూలించే అవకాశం ఉంది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌
టోర్నీలో ప్రదర్శన: సీజన్‌లో ఢిల్లీ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగింది. 14 లీగ్‌ మ్యాచ్‌లలో 8 గెలిచి, 6 ఓడింది. అయితే తొలి 9 మ్యాచ్‌లలో 7 గెలిచి ఊపు మీద కనిపించిన టీమ్‌ ఒక్కసారిగా తడబడింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన తర్వాత చివరకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటి ముందంజ వేసింది.  

నాలుగు వరుస పరాజయాలు ఢిల్లీ బ్యాటింగ్‌ బలహీనతను చూపించాయి. ప్రత్యర్థిపై ఒక్కసారిగా విరుచుకుపడే విధ్వంసక ఆటగాళ్లు జట్టులో లేరు. ముఖ్యంగా టోర్నీ ఆసాంతం ఓపెనింగ్‌ పేలవంగా సాగింది. పంత్, పృథ్వీ షా అనుకున్న స్థాయిలో ఆడకపోగా, స్టొయినిస్‌ ఆరంభ మ్యాచ్‌ల తర్వాత వరుస వైఫల్యాలు కొనసాగించాడు. వికెట్లు తీసినా, రబడ బౌలింగ్‌లో భారీగా పరుగులు కూడా వచ్చాయి. రహానే స్ట్రయిక్‌రేట్‌ మరీ పేలవంగా ఉండటంతో జట్టు అతడిని నమ్మలేని పరిస్థితి.(ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేస్తారా?)

ముంబై ఇండియన్స్‌
14 లీగ్‌ మ్యాచ్‌లలో 9 గెలిచి, 5 ఓడింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్‌లో ఎదురైన పరాజయాన్ని తప్పిస్తే... ముంబై రెండుసార్లు సూపర్‌ ఓవర్‌లోనే ఓటమి పాలైంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో కూడా ఆ జట్టు మెరుగైన స్కోర్లే సాధించింది.  

బలం: పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌... ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకొని భారీ స్కోరు అందించగలరు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్‌లపై ప్రధానంగా జట్టు ఆధారపడుతోంది. ఈ ముగ్గురు టోర్నీలో 400కు పైగా పరుగులు సాధించారు. చివర్లో అలవోకగా సిక్సర్లు బాదే పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోతే తిరుగుండదు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌ల ఎనిమిది ఓవర్లను ఎదుర్కోవడం ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమే. వీరిద్దరిని మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పేయగల సమర్థులు. బుమ్రా 23 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్‌కు 20 వికెట్లు దక్కాయి.  

ఇక ముంబై జట్టులో బలహీనతలు ఏమీ లేవనే చెప్పాలి. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. కాకపోతే రోహిత్‌ శర్మ ఫామ్‌ కాస్త ఆందోళన కల్గిస్తోంది. రోహిత్‌ గాడిలో పడితే ముంబై ఫుల్‌ స్వింగ్‌లో విజృంభిస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఎంతవరకూ ఆడతాడో చూడాలి.

ముంబై ఇండియన్స్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యా, కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రహానే, రిషభ్‌పంత్‌, మార్కస్‌ స్టోయినిస్‌, డానియల్‌ సామ్స్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కగిసో రబడా, అన్‌రిచ్‌ నోర్జే

మరిన్ని వార్తలు