IND Vs SL: శ్రీలంకతో తొలి వన్డే.. డబుల్‌ సెంచరీ ఆటగాడికి నో ఛాన్స్‌! క్లారిటీ ఇచ్చిన రోహిత్‌

9 Jan, 2023 21:15 IST|Sakshi

స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 10 (మంగళవారం)న గౌహతి వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.  శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ తిరిగి వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చారు.

ఇక తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో రోహిత్‌ శర్మ జట్టు కూర్పుతో  సహా పలు అంశాలపై మాట్లాడాడు. తొలి వన్డేకు భారత తుది జట్టులో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కడం కష్టమని రోహిత్‌ తెలిపాడు. అతడి స్థానంలో మరో యువ ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు హిట్‌మ్యాన్‌ అన్నాడు.

కాగా ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కిషన్‌ అద్భుతమైన డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సీనియర్‌ జట్టులోకి రావడంతో మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రోహిత్‌ మాట్లాడుతూ.. "గత కొన్ని సిరీస్‌ల నుంచి గిల్‌, ఇషాన్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే కిషన్‌ కంటే గిల్‌కు వన్డేల్లో మెరుగైన ట్రాక్‌ రికార్డు ఉంది.

కాబట్టి గిల్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాము. అదే విధంగా కిషన్‌ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించడం అంత సులభం కాదు అని నాకు తెలుసు. ఈ సిరీస్‌లో కిషన్‌కు కూడా తప్పకుండా అవకాశం దక్కుతుంది" అని పేర్కొన్నాడు. కాగా గిల్‌కు వన్డేల్లో అద్భుతమైన రికార్డుఉంది. ఇప్పటి వరకు 13 వన్డే మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 687 పరుగులు సాధించాడు.
చదవండి: IND Vs SL: బుమ్రా గాయంపై స్పందించిన రోహిత్‌ శర్మ.. ఏమన్నాడంటే?

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని వార్తలు