IPL 2022: కీలక పోరుకు సిద్దమైన సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌.. తొలి విజయం ఎవరిది!

9 Apr, 2022 13:30 IST|Sakshi

ఐపీఎల్‌-2022లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. డివై పాటెల్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు ఇప్పటివరకు ఈ సీజన్‌లో బోణీ కొట్టలేదు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఐపీఎల్‌-2022లో తొలి విజయాన్ని నమోదు చేయాలని ఇరు జట్లు భావిస్తోన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటో పరిశీలిద్దాం.

ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో ఆ జట్టు కాస్త తడబడుతోంది. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఘనమైన ఆరంభం లభించడంలేదు. కెప్టెన్‌ విలియమ్సన్‌ రాణించాల్సిన అవసరం ఆ జట్టుకు ఎంతో ఉంది. అదే విధంగా మిడిలార్డర్‌లో రాహుల్‌ త్రిపాఠి, మాక్రమ్‌, పూరన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌లో త్రిపాఠి, పూరన్‌ అద్భుతంగా రాణించారు. ఇక బౌలింగ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌ పటిష్టంగా కన్పిస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పరుగులు భారీగా సమర్పించుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో తిరిగి గాడిలో పడ్డారు.

టి.నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్ కుమార్‌ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ విషయానికి వస్తే.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. బ్యాటింగ్‌ పరంగా సీఎస్‌కే పటిష్టంగా కన్పిస్తోంది. ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కాస్త ఇబ్బంది పెట్టే విషయం. రాబిన్‌ ఊతప్ప, మెయిన్‌ అలీ, రాయుడు, దోని అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

ఇక చెన్నై బౌలర్లు అతంగా రాణించలేకపోతున్నారు. దీపక్‌ చహార్‌ లేని లోటు సీఎస్‌కేలో సృష్టంగా కన్పిస్తోంది. కాగా డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ జోర్డాన్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌ వంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో చెన్నై బరిలోకి దిగే అవకాశం ఉంది. తుషార్‌ దేశ్‌ పాండే స్థానంలో రాజ్‌వర్దన్‌ హాంగేర్కార్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 17 సార్లు తలపడగా.. చెన్నై 13 మ్యాచ్‌ల్లో గెలవగా, ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 4 సార్లు మాత్రమే విజయం సాధించింది.

తుది జట్లు (అంచనా):
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, మహేష్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, రాజ్ హంగర్గేకర్. 

మరిన్ని వార్తలు