జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్‌! ఎందుకో తెలుసా?

3 Jan, 2023 21:15 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌-2022లో మంగళవారం మెల్‌బోర్న్ స్టార్స్- మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెనిగేడ్స్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేయడానికి వచ్చిన మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్‌ ఆడమ్ జంపా నాన్-స్ట్రైకర్ టామ్ రోజర్స్‌ను రనౌట్‌(మన్కడింగ్‌) చేయడానికి ప్రయత్నించాడు.

జంపా బంతి వేయకముందే రోజర్స్‌ క్రీజును వదిలి బయటకు వెళ్లగా.. అది గమనించిన అతడు వెంటనే వికెట్లను గిరాటేశాడు. దీంతో రనౌట్‌కు అప్పీల్‌ చేయగా, ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. కాగా పలు మార్లు రిప్లేలో చూసిన  థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు.

కాగా కొత్త రూల్స్‌ ప్రకారం మన్కడింగ్‌ను సాధారణ రనౌట్‌గానే పరిగిణిస్తారు. ఈ క్రమంలో థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఎందుకు నాటౌట్‌గా ప్రకటించాడన్నది ప్రేక్షకులకు ఆర్ధం కాలేదు.

థర్డ్‌ అంపైర్‌ ఎందుకు నాటౌట్‌ ఇచ్చాడంటే?
మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్‌ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్‌ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ జంపా మాత్రం తన బౌలింగ్‌ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు.  దీంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌పై  రెనెగేడ్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


చదవండి: IND vs SL: దీపక్‌ హుడా, అక్షర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. శ్రీలంక టార్గెట్‌ 163 పరుగులు

మరిన్ని వార్తలు