IND Vs ENG: తొలి టెస్ట్‌ సమయంలో ప్రేక్షకుల చెవుల్లో ఆ ఎర్రటి పరికరాలేంటి..?

10 Aug, 2021 13:16 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు చెవులకు ఎర్రటి పరికరాలను ధరించి కనిపించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ మద్దతుదారులు ఈ ఎర్రటి పరికరాలను ధరించి, అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశారు. ఇంతకి వారు పెట్టుకున్న మెషిన్లు ఏంటో తెలుసా? అవి ఎందుకు ధరిస్తారు? వాటి వల్ల ఉపయోగం ఏంటంటే.. 

స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌లు చూసే వారికి ఆన్‌ ఫీల్డ్‌ ఏం జరుగుతుందో సరిగ్గా అర్దం కాదు.  ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు బంతి కనపడుతుంది కానీ టెస్ట్‌ల్లో బౌండరీలు, సిక్సర్లు అరుదుగా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రేక్షకులు తమ చెవులకు చిన్న రేడియోలను పెట్టుకుంటారు. లోకల్ రేడియో స్టేషన్‌లో క్రికెట్ కామెంట్రీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటుంటారు. టీవీ ప్రసారాలు అందించే స్కై స్పోర్ట్స్ నెట్‌వర్కే ఈ రేడియో ప్రసారాలనూ అందిస్తుంది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులకు పిచ్‌ మధ్యలో ఏం జరుగుతుందో కామెంట్రీ రూపంలో వినే అవకాశం లభిస్తుంది. 

అయితే ఇందుకు ఫోన్‌లో రేడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు.  అయితే అందుకోసం రేడియో ప్రసారాలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా స్కై స్పోర్ట్స్ అందించే ఈ స్పెషల్ గాడ్జెట్స్ ద్వారా మాత్రమే లైవ్‌ కామెంట్రీ వినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు అలా చెవులకు రేడియోలు పెట్టుకొని కనపడ్డారు. ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో భారత జట్టు విజయానికి చేరువుగా వచ్చినా.. వర్షం కారణంగా చివరి రోజు ఒక్క బంతి పడకుండా ఆట రద్దయ్యింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

మరిన్ని వార్తలు