మూడు వరుస లీగల్‌ డెలివరీల్లో వికెట్లు.. హ్యాట్రిక్‌ కాదు

9 Nov, 2020 19:25 IST|Sakshi

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ విజయంలో కగిసో రబడా, మార్కస్‌ స్టోయినిస్‌లు కీలక పాత్ర పోషించారు. 190 పరుగుల టార్గెట్‌ను  ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ పోరాడింది. రబడా, స్టోయినిస్‌లు వరుస వికెట్లు సాధించి దెబ్బమీద దెబ్బ కొట్టడంతో సన్‌రైజర్స్‌ తిరిగి తేరుకోలేకపోయింది. 19 ఓవర్‌లో రబడా వరుసగా మూడు వికెట్లు సాధించడం హైలైట్‌గా నిలిచింది. అయితే రబడా వరుస మూడు లీగల్‌ డెలివరీల్లో వికెట్లు సాధించినా అది హ్యాట్రిక్‌గా నమోదు కాలేదు.  19 ​ఓవర్‌ మూడో బంతికి అబ‍్దుల్‌ సామద్‌ను ఔట్‌ చేసిన రబడా.. ఆ తర్వాత బంతికి రషీద్‌ ఖాన్‌ను ఔట్‌ చేశాడు. ఆపై ఐదో బంతిని వైడ్‌గా వేశాడు.

కానీ ఆ బంతి స్థానంలో వేసిన మరో బంతికి శ్రీవాత్స్‌ గోస్వామిని పెవిలియన్‌కు పంపాడు. దాంతో అది హ్యాట్రిక్‌ అనే అనుమానం చాలామందిలో తలెత్తింది. కానీ అది హ్యాట్రిక్‌ కాదు. వరుస మూడు లీగల్‌ డెలివరీల్లో వికెట్లు సాధించినా, ఒక బంతి వైడ్‌ కావడంతో హ్యాట్రిక్‌ మిస్సయ్యింది. నిబంధనల ప్రకారం వరుస మూడు బంతుల్లో మాత్రమే ఒక బౌలర్‌ వికెట్లు సాధిస్తేనే హ్యాట్రిక్‌ అవుతుంది కానీ లీగల్‌ డెలివరీలు అయినంత మాత్రన హ్యాట్రిక్‌గా పరిగణించరు. మరొకవైపు మ్యాచ్‌లో వరుసగా రెండు వికెట్లు సాధించిన తర్వాత మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లి, సదరు బౌలర్‌ ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌ తీసినా అది కూడా హ్యాట్రిక్‌ కాదు. అలానే ఒక మ్యాచ్‌లో వరుసగా రెండు వికెట్లు సాధించి, తదుపరి మ్యాచ్‌లో ఆ బౌలర్‌ తాను వేసిన తొలి బంతికే వికెట్‌ తీసినా హ్యాట్రిక్‌గా నమోదు చేయరు. కేవలం ఒకే మ్యాచ్‌లో మాత్రమే వరుస వికెట్లును తీసే క్రమంలో మాత్రమే హ్యాట్రిక్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు