Virat Kohli: కోహ్లి బాధ వర్ణణాతీతం.. ఒకప్పుడు కెప్టెన్‌గా; ఇప్పుడు ఆటగాడిగా

10 Nov, 2022 20:02 IST|Sakshi

టీమిండియా మరోసారి ఐసీసీ టైటిల్‌ కొట్టడంలో విఫలమయింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌తోనే ఆటను ముగించింది. ఇంగ్లండ్‌ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇలా చేసినందుకు టీమిండియాపై కోపం వస్తుంటే.. ఇదే సమయంలో టీమిండియా స్టార్‌ 'కింగ్‌' కోహ్లిని చూస్తే మాత్రం బాధ కలగక మానదు.  ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో తాను సక్సెస్‌ అయిన ప్రతీసారి టీమిండియా ఫెయిల్యూర్‌గా మిగిలిపోతుంది.

ధోని కెప్టెన్సీలో టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. ఆ రెండింటిలో కోహ్లి సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ రెండు టోర్నీల్లో కోహ్లి పెద్దగా రాణించింది లేదు. అందుకే వాటి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ 2014, 2016.. తాజాగా 2022 టి20 వరల్డ్‌కప్‌లతో పాటు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి బ్యాటర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌ సంగతి పక్కనబెడితే పైన చెప్పుకున్న ప్రతి టి20 ప్రపంచకప్‌లో  చెలరేగిన కోహ్లీకి ప్రతీసారి నిరాశే మిగిలింది. గతంలో కెప్టెన్‌గా  నిరాశచెందిన కోహ్లి ఇప్పుడు ఆటగాడిగానూ అదే బాధను అనుభవిస్తున్నాడు. 

2022 టి20 ప్రపంచకప్‌లో కోహ్లి.. 296 పరుగులు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆపై నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ ఇలా ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ తాను రాణిస్తూ వచ్చాడు. ఇన్ని చేసి చివరకు చూస్తే మళ్లీ అదే నిరాశ. టీమిండియా జట్టుగా విఫలం కావడంతో కోహ్లికి మరోసారి ఐసీసీ టైటిల్‌ అందుకునే భాగ్యం లేకుండా పోయింది.

వన్డే ప్రపంచకప్ ల సంగతి పక్కనబెడితే టీ20 ప్రపంచకప్ లలో  కోహ్లికి మంచి రికార్డు ఉంది. 2014  టీ20 ప్రపంచకప్‌లో 319 పరుగులు చేసిన కోహ్లి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 2016లో 273 రన్స్ చేశాడు. తాజాగా 296 పరుగులు చేసిన కోహ్లి ప్రస్తుతానికి టాపర్‌గా ఉన్నాడు. 2014లో ఫైనల్‌లో ఓడిని టీమిండియా.. 2016లో సెమీస్‌లో.. తాజాగా 2022లోనూ సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టింది.

ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌లలో కోహ్లి ఇప్పటివరకు ఏకంగా 1100 కు పైగా పరుగులు చేశాడు.  కోహ్లి దరిదాపుల్లో టాప్-10 లిస్టులో ఉన్న క్రికెటర్లలో రోహిత్ శర్మ మినహా మరెవరూ లేరు. వచ్చే ప్రపంచకప్ (2024) లో  రోహిత్ ఆడేది అనుమానమే. దీంతో  కోహ్లీ రికార్డుకు వచ్చిన చిక్కేమీ లేదు.  ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో మరో అర్థసెంచరీతో మెరిసిన కోహ్లి టి20 ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు టి20లలో  నాలుగు వేల మైలురాయిని టచ్ చేసింది కింగ్‌ కోహ్లి మాత్రమే.

మరి ఇన్ని రికార్డులు, ఘనతలు అందుకున్న కోహ్లికి 2013 తర్వాత ఐసీసీ టైటిల్‌ అందుకోవలనేది అందని ద్రాక్షలానే మిగిలిపోతూ వస్తున్నాది. ప్రస్తుతం కోహ్లి వయస్సు 33 ఏళ్లు. ఇప్పుడున్న ఫామ్‌ను ఇలానే కంటిన్యూ చేస్తే మరో మూడేళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో కోహ్లి రెండు వరల్డ్‌కప్‌లు ఆడే అవకాశం ఉంది(2023 వన్డే వరల్డ్‌కప్‌, 2024 టి20 వరల్డ్‌కప్). మరి వచ్చే మూడేళ్లలో అన్ని సక్రమంగా జరిగి కోహ్లి జట్టులో ఉంటే కనీసం అప్పుడైనా వరల్డ్‌కప్‌ అందుకుంటాడని ఆశిద్దాం. 

చివరగా కోహ్లి గురించి ఒక మాట.. ''టి20 ప్రపంచకప్‌ నుంచి టీమిండియా నిష్క్రమించిందేమో కానీ నువ్వు కాదు కోహ్లి.. నీ ఆట అజరామరం. ప్రతీ మ్యాచ్‌లో నీ విలువేంటో చూపించావు. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకున్నావు. నీ ఆటకు సలాం చెప్పకుండా ఉండలేం. వరల్డ్‌కప్‌ గెలవకపోవచ్చు.. కానీ నీ ఆటతీరుతో మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నావు  ''Hatts Off Virat Kohli'..''

చదవండి: వాళ్లు విఫలం.. వీళ్లపై భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి కారణాలు

మరిన్ని వార్తలు