WI Vs AUS: దుమ్ము రేపిన స్టార్క్‌.. ఆసీస్‌ ఘన విజయం

21 Jul, 2021 17:26 IST|Sakshi

బార్బడోస్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 133 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మూడు వన్డేల సిరీస్‌లో1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి.. 252 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో తడబడ్డ విండీస్‌ 26.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో ఆసీస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇక ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించిన మిచెల్‌ స్టార్క్‌ ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’గా నిలిచాడు. తద్వారా ఒక వన్డేలో ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. హాజిల్‌వుడ్‌ 3 వికెట్లతో రాణించాడు. విండీస్‌ ఆటగాళ్లలో కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌(56 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా, అలెక్స్‌ క్యారీకి ఆసీస్‌ కెప్టెన్‌గా ఇది తొలి విజయం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ... ‘‘అవును.. ఇదెంతో ప్రత్యేకం. సారథిగా తొలి గెలుపు.

ముగ్గురు ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశారు. పిచ్‌ మరీ అంత అనుకూలంగా కూడా ఏమీ లేదు. కానీ, ఆష్టన్‌ టర్నర్‌ అద్భుతం చేశాడు. వేస్‌ అగర్‌ సైతం తన డెబ్యూను మరింత స్పెషల్‌గా మార్చుకున్నాడు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్‌ ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టు ముందంజలో నిలిచింది.

స్కోర్లు: ఆస్ట్రేలియా- 252/9 (49)
వెస్టిండీస్‌- 123 (26.2)

మరిన్ని వార్తలు