WI Vs Aus: దెబ్బకు దెబ్బ తీసిన విండీస్‌; పూరన్‌ కెప్టెన్‌ ఇన్నిం‍గ్స్‌

25 Jul, 2021 12:01 IST|Sakshi
నికోలస్‌ పూరన్‌, జేసన్ హోల్డర్

బ్రిడ్జ్‌టౌన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో వెస్డిండీస్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కరోనా కేసు నేపథ్యంలో ఒకరోజుకు వాయిదా పడిన మ్యాచ్‌ శనివారం జరిగింది. ఇక తొలి వన్డేలో దారుణ పరాజయం చవిచూసిన విండీస్‌ రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. లోస్కోరింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విండీస్‌ స్పిన్నర్లు దాటికి 47.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వేస్‌ అగర్‌ 41, ఆడమ్‌ జంపా 36 , మాధ్యూ వేడ్‌ 36 పరుగులతో ఆదుకున్నారు. విండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ , అకియల్‌ హోసెన్‌ చెరో 3 వికెట్లు తీయగా.. కాట్రెల్‌ 2 వికెట్లు తీశాడు.

అనంతరం 188 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగిన వెస్టిండీస్ టీమ్ తడబడింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావో ఖాతా తెరవలేకపోయాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జేసన్ మహమ్మద్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. పించ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ సైతం రెండు పరుగులకే అవుట్ కావడంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌కు మరో పరాభవం తప్పదనిపించింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న నికొలస్ పూరన్ సమయస్ఫూర్తితో ఆడాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లతో 38 పరుగులు చేసిన హోప్ అవుటైన తరువాత మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ.. జేసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.

69 బంతుల్లో 52 పరుగులు చేసిన హోల్డర్ స్టార్క్‌కు ఎల్బీగా వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటికే లక్ష్యానికి సమీపించడం, రిక్వైర్డ్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో విండీస్ నింపాదిగా లక్ష్యాన్ని అందుకుంది. 38 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ 75 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్ 3, ఆడమ్ జంపా 2, టర్నర్ ఒక వికెట్ తీసుకున్నారు. నికొలస్ పూరన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే సోమవారం జరగనుంది.

మరిన్ని వార్తలు