WI Vs Ban 1st ODI: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్‌ ఘన విజయం!

11 Jul, 2022 11:28 IST|Sakshi
ట్రోఫీతో విండీస్‌, బంగ్లా కెప్టెన్లు నికోలస్‌ పూరన్‌, తమీమ్‌ ఇక్బాల్‌(PC: Windies Cricket)

Bangladesh tour of West Indies, 2022- 1st ODI: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. మొదటి వన్డేలో ఆతిథ్య విండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

కాగా బంగ్లాదేశ్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.  టెస్టు సిరీస్‌, టీ20 సిరీస్‌లను విండీస్‌ సొంతం చేసుకోవడంతో పర్యాటక బంగ్లాకు చేదు అనుభవం మిగిలింది. ఈ నేపథ్యంలో గయానా వేదికగా సాగిన మొదటి వన్డేలో గెలుపొంది ఊరట విజయాన్ని అందుకుంది బంగ్లాదేశ్‌.

మ్యాచ్‌ సాగిందిలా...
వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. ఇందులో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌ బృందం..  41 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో 33 పరుగులతో బ్రూక్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌, రొమారియో షెపర్డ్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, జేడెన్‌ సీల్స్‌ మాత్రమే పదికి పైగా పరుగులు చేశారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది వెస్టిండీస్‌ జట్టు.

6 వికెట్ల తేడాతో..
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు.. కెప్టెన్‌, ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ 33 పరుగులతో రాణించి మంచి పునాది వేశాడు. మరో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ విఫలమైనా(1).. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన న్ముల్‌ హుసేన్‌ 37, నాలుగో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆఖర్లో నారుల్‌ హుసేన్‌ 20 పరుగులతో రాణించాడు.

దీంతో 31. 5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. 9 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనాన్ని శాసించిన బంగ్లా బౌలర్‌ మోహెదీ హసన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన విండీస్‌ ఆటగాడు గుడకేశ్‌ మోటీ ఒక వికెట్‌ తీసి మధుర జ్ఞాపకం మిగుల్చుకున్నాడు.

వెస్టిండీస్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మొదటి వన్డే:
టాస్‌: బంగ్లాదేశ్‌- బౌలింగ్‌
వెస్టిండీస్‌ స్కోరు: 149/9 (41)
బంగ్లాదేశ్‌ స్కోరు: 151/4 (31.5)
విజేత: బంగ్లాదేశ్‌.. 6 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మెహెదీ హసన్‌(3 వికెట్లు)

చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే!
IRE Vs NZ 1st ODI: భళా బ్రేస్‌వెల్‌.. ఐర్లాండ్‌పై కివీస్‌ విజయం

మరిన్ని వార్తలు