ICC Cricket World Cup Super League: వెస్టిండీస్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. ఈ సిరీస్‌ వాళ్లదే!

14 Jul, 2022 12:06 IST|Sakshi
విండీస్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌(PC: Bangladesh Cricket)

WI Vs Ban 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌తో ఘన విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2-0తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్.. వెస్టిండీస్‌ పర్యటనకు వచ్చింది.

ఈ క్రమంలో టెస్టు, టీ20 సిరీస్‌లను విండీస్‌ కైవసం చేసుకుంది. ఇక ప్రపంచకప్‌-2023 నేపథ్యంలో సూపర్‌ లీగ్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్‌ పర్యాటక బంగ్లా సొంతమైంది. కాగా గయానా వేదికగా బుధవారం(జూలై 13) వెస్టిండీస్‌- బంగ్లాదేశ్‌ మధ్య రెండో వన్డే జరిగింది.

విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలం
టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 108 పరుగులకే కుప్పకూలింది. కీమో పాల్‌(25- నాటౌట్‌) మినహా ఎవరూ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 35 ఓవర్లలోనే పూరన్‌ బృందం కథ ముగిసింది.

బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్‌ 4 వికెట్లు తీయగా.. నాసుమ్‌ అహ్మద్‌ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్‌, కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ శుభారంభం అందించాడు.

అదరగొట్టిన బంగ్లా కెప్టెన్‌
అర్ధ శతకంతో రాణించి సత్తా చాటాడు. మరో ఓపెనర్‌ శాంటో 20 పరుగులు చేసి నిష్క్రమించగా.. లిటన్‌ దాస్‌ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 20.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ భారీ విజయం సాధించింది. నాసుమ్‌ అహ్మద్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! వైస్‌ కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!
Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్‌, వాతావరణం వివరాలు! రోహిత్‌ సేన గెలిచిందంటే!


 

>
మరిన్ని వార్తలు