WI VS NZ 1st T20: రాణించిన విలియమ్సన్‌.. తిప్పేసిన సాంట్నర్

11 Aug, 2022 09:53 IST|Sakshi

కింగ్‌స్టన్ (జమైకా): స్వదేశంలో టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయి పరువు పోగొట్టుకున్న వెస్టిండీస్ జట్టు.. వరుస పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (ఆగస్ట్‌ 10) జరిగిన తొలి టీ20లోనూ కరీబియన్‌ జట్టు ఓటమిపాలైంది. కేన్‌ విలియమ్సన్‌, మిచెల్‌ సాంట్నర్‌ రాణించడంతో పర్యాటక జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. విలియమ్సన్ (33 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (29 బంతుల్లో 43; 4  ఫోర్లు, 2 సిక్సర్లు), జిమ్మీ నీషమ్‌ (15 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, ఛేదనలో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఆఖర్లో రొమారియో షెపర్డ్(16 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), ఓడియన్ స్మిత్ (12 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్‌)లు భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. మిచెల్ సాంట్నర్ (3/19) తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు వికెట్లతో పర్వాలేదనిపించాడు. 
చదవండి: బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం.. సిరీస్‌ జింబాబ్వే సొంతం

మరిన్ని వార్తలు