WI Vs NZ 3rd ODI: ఓ సెంచరీ, కెప్టెన్‌ స్కోరు 91, మరో అర్ధ శతకం.. అయినా పాపం విండీస్‌! మా ఓటమికి కారణం అదే!

22 Aug, 2022 11:12 IST|Sakshi
వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌(PC: Windies Cricket)

West Indies vs New Zealand, 3rd ODI- Nicholas Pooran Comments: నెదర్లాండ్స్‌ పర్యటనలో వన్డే సిరీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌.. గెలుపు జోష్‌లో పాకిస్తాన్‌కు పయనం.. కానీ ఆతిథ్య జట్టు చేతిలో వైట్‌వాష్‌.. స్వదేశంలో వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌... సొంతగడ్డపై టీమిండియాతో వన్డే సిరీస్‌లోనూ ఇదే ఫలితం.. తాజాగా న్యూజిలాండ్‌ చేతిలో సిరీస్‌లో కరేబియన్‌ గడ్డపై 2-1తో ఓటమి.. ఇలా వెస్టిండీస్‌ ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్‌లో ఘోర పరాజయాలు నమోదు చేసింది.

నికోలస్‌ పూరన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెదర్లాండ్స్‌ పర్యటనలో విజయం, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో గెలుపు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఆఖరి వరకు పోరాడినా చిన్న చిన్న తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇక తాజాగా కివీస్‌తో నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో విండీస్‌ పరాజయం పాలైంది. దీంతో మరోసారి మరో పర్యాటక జట్టుకు సిరీస్‌ను సమర్పించుకుంది.

ఓ సెంచరీ.. రెండు అర్ధశతకాలు!
బార్బడోస్‌ వేదికగా వెస్టిండీస్‌- న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం(ఆగష్టు 21) మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు షాయీ హోప్‌(51), కైల్‌ మేయర్స్‌(105) అద్బుత ఆరంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ సైతం 55 బంతుల్లోనే 91 పరుగులు సాధించి సత్తా చాటాడు. 

పేకమేడలా కుప్పకూలిన మిడిలార్డర్‌!
కానీ కివీస్‌ బౌలర్ల ధాటికి విండీస్‌ మిడిలార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. పూరన్‌ తర్వాత రంగంలోకి దిగిన ఆటగాళ్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1,2,4,1,4,20(నాటౌట్‌),1(నాటౌట్‌). దీంతో నిర్ణీత 50 ఓవర్లలో పూరన్‌ బృందం 301 పరుగులు స్కోరు చేసింది.

జిమ్మీ నీషమ్‌ మెరుపులు
లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ విజయానికి ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ 57 పరుగులతో రాణించి బాటలు పరిచాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే 56, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 69, డారిల్‌ మిచెల్‌ 63 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖర్లో జిమ్మీ నీషమ్‌ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పర్యాటక​ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

అదే మా కొంప ముంచింది.. భారీ మూల్యం చెల్లించాం!
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ మాట్లాడుతూ.. తాము మెరుగైన స్కోరే చేశామన్నాడు. అయితే, నంబర్‌ వన్‌ జట్టు అయిన న్యూజిలాండ్‌ను ఇలాంటి పిచ్‌పై ఆపడం ఎవరితరం కాదని.. పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు అద్బుతంగా బ్యాటింగ్‌ చేశారని ప్రశంసించాడు. 

అదే విధంగా.. తమ జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువని.. ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా మళ్లీ పుంజుకుంటున్న తీరు ప్రశంసనీయమన్నాడు. రెండో వన్డే(బ్యాటర్ల వైఫల్యంతో 50 పరుగుల తేడాతో ఓటమి)లో చేసిన పొరపాటు వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా పొరపాట్లు సరిదిద్దుకుని మరింత ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.

చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్‌ మిస్‌! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం..
IND vs ZIM 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ గురి

మరిన్ని వార్తలు