WI vs NZ: మెరిసిన అలెన్, సౌతీ, బౌల్ట్‌.. విండీస్‌పై కివీస్‌ విజయం

21 Aug, 2022 06:30 IST|Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 48.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (117 బంతుల్లో 96; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.

డరైల్‌ మిచెల్‌ (41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి అలెన్‌ నాలుగో వికెట్‌కు 84 పరుగులు జత చేశాడు. జేసన్‌ హోల్డర్‌ (3/24), కెవిన్‌ సింక్లెయిర్‌ (4/41) కివీస్‌ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశారు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను ట్రెంట్‌ బౌల్ట్‌ (3/18), టిమ్‌ సౌతీ (4/22) బెదరగొట్టారు. విండీస్‌ స్కోరు 63/7 వద్ద ఉన్నపుడు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.

అనంతరం విండీస్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 212 పరుగులుగా నిర్ణయించారు. చివర్లో యానిక్‌ కరియా (52; 2 ఫోర్లు, 1 సిక్స్‌), అల్జారి జోసెఫ్‌ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి తొమ్మిదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే నాలుగు పరుగలు తేడాలో వీరిద్దరు అవుటవ్వడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ 161 పరుగుల వద్ద ముగిసింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే నేడు జరుగుతుంది. 

చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు