రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతున్న పాక్‌.. ఆదుకున్న కెప్టెన్‌

15 Aug, 2021 11:20 IST|Sakshi

జమైకా: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటై 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (97; 12 ఫోర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. హోల్డర్‌ (58; 10 ఫోర్లు)తో కలసి బ్రాత్‌వైట్‌ ఐదో వికెట్‌కు 96 పరుగులు జతచేశాడు. పాక్‌ బౌలరల్లో షాహీన్‌ అఫ్రిది 4 వికెట్లు, మహ్మద్‌ అబ్బాస్‌ 3, ఫహీమ్‌ అష్రాఫ్‌, హసన్‌ అలీ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 36 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ మరోసారి తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(54 నాటౌట్‌) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇమ్రాన్‌ బట్‌, ఫవాద్‌ ఆలం డకౌట్‌ కాగా, ఆబిద్‌ అలీ(34), అజార్‌ అలీ(23), మహ్మద్‌ రిజ్వాన్‌(30) రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, జేడెన్‌ సీల్స్‌ తలో రెండు వికెట్లు, హోల్డర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు పాక్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆ జట్టు 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు