WI Vs PAK: నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్‌తో విండీస్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ

16 Aug, 2021 15:48 IST|Sakshi

జమైకా: పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిధ్య విండీస్‌ జట్టు నరాలు తెగే ఉత్కంఠత నడుమ అద్భుత విజయం సాధించింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. పాక్‌ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ తన జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ప్రారంభం కానుంది.

కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 160/5తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ పేసర్‌ జేడెన్‌ సీల్స్‌ (5/55) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో విండీస్‌ తరఫున 5 వికెట్ల ఘనత సాధించి అత్యంత పిన్న వయస్కుడిగా(19 ఏళ్లు) రికార్డుల్లోకెక్కాడు.

అనంతరం పాక్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. రోస్టన్ ఛేజ్ (22), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (55), హోల్డర్‌(16), జాషువా డిసిల్వా(13), కీమర్‌ రోచ్‌(30 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. హసన్ అలీ(3/37), షాహీన్ ఆఫ్రిది(4/50), ఫహీమ్‌ అష్రాఫ్‌(2/29) విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. ఓ దశలో కరేబియన్ల ఓటమి దాదాపు ఖరారైంది. ఈ సమయంలో కీమర్ రోచ్ సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 8 వికెట్లతో రాణించిన జేడెన్‌ సీల్స్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా, పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరగులు చేయగా.. విండీస్‌ 253 రన్స్‌కు ఆలౌటైంది.
చదవండి: Afghanisthan: క్రికెటర్ల పరిస్థితి.. ఐపీఎల్‌లో ఆడతారా?

మరిన్ని వార్తలు